Supreme Court: కంచ భూముల్లో పచ్చదనం పునరుద్ధరిస్తారా ? జైలుకెళ్తారా ?
కంచ భూముల్లో పచ్చదనం పునరుద్ధరిస్తారా ? జైలుకెళ్తారా ?
Supreme Court : కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. ‘కంచగచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిది. పరిస్థితులను కప్పి పుచ్చాలని చూస్తే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అర డజను మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుంది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం’’ అని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘స్వల్ప కాలంలో డజన్ల బుల్డోజర్లను పెట్టి కంచగచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల్లో చెట్లను నరికేస్తారా ? ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. మూడురోజుల వరుస సెలవులను చూసుకొని, ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను నాలుగు వారాల్లోపు సమర్పించాలని నిర్దేశిస్తూ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తరఫున అమికస్‌క్యూరీ పరమేశ్వర్ వాదనలు వినిపించారు. సీఈసీ సిఫార్సులతో నివేదిక సమర్పించినట్లు అమికస్‌క్యూరీ చెప్పారు. ఆ నివేదికపై సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని సింఘ్వీ కోరడంతో జస్టిస్ గవాయ్ అనుమతిస్తూ విచారణను జులై 23కి వాయిదా వేశారు.
Supreme Court – నరికింది 147 చెట్లే – ప్రభుత్వ న్యాయవాది
‘సుప్రీంకోర్టు(Supreme Court) ఇదివరకు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడ అన్నిరకాల కార్యకలాపాలూ ఆపేశాం. అక్కడ మొక్కలు నాటడానికి సంబంధించిన ఫొటోలను మా అఫిడవిట్ తోపాటు సమర్పించాం. అక్కడ వేల చెట్లను కొట్టేయలేదు. కేవలం 147 మాత్రమే నరికేశారు. ఆ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు వైల్డ్‌లైఫ్ వార్డెన్ అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు’ అని సింఘ్వీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చెట్లు కొట్టేసిందన్న న్యాయమూర్తి వ్యాఖ్యలకు స్పందిస్తూ… పదేళ్ల న్యాయవివాదం ముగిసిన తర్వాత మొత్తం అధికారిక అనుమతులు తీసుకోడానికి ఏడాది సమయం పట్టిందని తెలిపారు. ఏడాది నుంచి దీనిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తూ వచ్చినట్లు వివరించారు. ఈ నిర్ణయం ఏదో వారం చివరలో తీసుకున్నది కాదని తెలియజేశారు.
60% భూభాగం ఒక మోస్తరు నుంచి దట్టమైన అటవీప్రాంతం – అమికస్‌క్యూరీ
‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ ఇమేజ్‌లు, క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన తర్వాత 104 ఎకరాల్లోని చెట్లను రెండు రాత్రుల్లోనే నరికేశారు. అందులో 60% భూభాగం ఒక మోస్తరు నుంచి దట్టమైన అటవీప్రాంతం’ అని అమికస్‌క్యూరీ పరమేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న తమ ప్రణాళికను ఉపసంహరించుకున్నట్లు కౌంటర్‌లో చెప్పలేదని, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకే మొగ్గుచూపుతోందని పేర్కొన్నారు. ‘కోర్టును సంతృప్తిపరిచిన తర్వాతే మేము ఆ విషయంలో ముందుకెళ్తాం. ఐటీ, ఎకాలజీ రెండూ ఏకకాలంలో సాగే విధంగా కోర్టుకు నచ్చచెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాం’ అని ప్రభుత్వ న్యాయవాది సింఘ్వీ వివరించారు. ‘ఐటీ, ఎకాలజీ కొనసాగడం అన్నది ఇక్కడ ప్రశ్నకాదు. మేము ఎప్పుడూ సుస్థిర అభివృద్ధినే కోరుకుంటున్నాం’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.
పర్యావరణ అనుమతులున్నాయా ?
60% భూభాగం అటవీప్రాంతం కిందికి వస్తుందని సీఈసీ(CEC) చెప్పడం ఇదే తొలిసారి అని సింఘ్వీ అన్నారు. ఏదేమైనా చెట్లు కొట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి కదా అని జస్టిస్ గవాయ్(Justice Gawai) ప్రశ్నించారు. అందుకు సింఘ్వీ సమాధానం ఇస్తూ అందుకు సంబంధించిన వివరాలన్నీ తమ అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. చట్ట ప్రకారం కొంత నిర్దిష్టమైన ఎత్తు ఉన్న చెట్ల నరికివేతకు స్వీయ ధ్రువీకరణపత్రం సరిపోతుందని, అయితే ఆ నిబంధన వర్తిస్తుందా.. లేదా అన్నది ధర్మాసనం పరిశీలించవచ్చని సింఘ్వీ తెలియజేశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సింఘ్వీ బదులిస్తూ 50 హెక్టార్లలోపు ఉన్న వాటికి ఈసీ అనుమతులు అవసరం లేదన్నారు. ఆ వాదనతో సీజేఐ విభేదించారు.
విద్యార్థుల కేసులపై ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేసుకోండి
కంచగచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల్లో చెట్ల నరికివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి విజిల్ బ్లోయర్లుగా వ్యవహరించిన 200 మంది విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ విద్యార్థుల తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తికి సీజేఐ జస్టిస్ గవాయ్(Justice Gawai) విముఖత వ్యక్తంచేశారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలనుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినందున దాన్ని ఇక్కడ సానుకూలంగా మలచుకోవాలనుకుంటున్నారా అని విద్యార్థుల తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
Also Read : Minister Konda Surekha: మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు