Swati Maliwal: ఆప్ ఎంపీకు అత్యాచార, హత్య బెదిరింపులు ?
ఆప్ ఎంపీకు అత్యాచార, హత్య బెదిరింపులు ?
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు ఎంపీ స్వాతీ మాలీవాల్(Swati Maliwal) సంచలన ఆరోపణలు చేసారు. ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ఫ్రచారాలు చేస్తున్నారని ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీని వల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. ఎంపీ స్వాతీ మాలీవాల్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Swati Maliwal…
“నా పార్టీకి చెందిన నాయకులు అసత్య ప్రచారాలు చేయడం వల్ల నాకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి. యూట్యూబర్ ధ్రువ్ రాథీ సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో అవి మరింత తీవ్రమయ్యాయి. స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే అతడి లాంటి వ్యక్తులు ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్ని వైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నాను’’ అని మాలీవాల్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు. ధ్రువ్ ను కలిసి తన వాదన వినిపిద్దామంటే… అతడు తన ఫోన్ కాల్స్‌కు స్పందించట్లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తుందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నెల 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో… అతని వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాలీవాల్ పై జరిగిన దాడి కేసులో సీఎం సహాయకుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు మే 18న అరెస్టు చేశారు. కాగా అతడు శనివారం బెయిల్ కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించాడు.
Also Read : Minister Bhatti Vikramarka : కేంద్రంలో రిజర్వేషన్లు ఎత్తిసేందుకు కుట్ర – మినిస్టర్ భట్టి