#FarmersProtest : రైతులతో చర్చలకు సిద్ధమన్న రూపాల
నూతన వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం
Farmers Protest : ఢిల్లీలో రైతులు తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. వీరి ఆందోళన సరిగ్గా 50 రోజులకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్ధతు పెరుగుతోంది. బీజేపీ శ్రేణులు, నాయకులు మాత్రం ఇదంతా విపక్షాల కుట్ర అంటూ కొట్టి పారేస్తున్నారు. తాము చని పోయినా పర్వాలేదు కానీ నూతన వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాల్సిందేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక 49 మంది రైతులు చని పోయారు. అయినా కేంద్రంలో చలనం రాలేదు.
తాజాగా కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి పరిషోత్తం రూపాల రైతుల సమస్యపై స్పందించారు. కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. రైతులతో ఎన్ని దఫాలైనా సరే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 8 దఫాలుగా చర్చించాని, మరోసారి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని రూపాల వెల్లడించారు. కాగా వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు భోగి మంటల్లో దహనం చేశారు. తమ వ్యతిరేకతను ఈ రకంగా కేంద్రానికి తెలియ చప్పారు.
సింఘు బోర్డర్ వద్ద లక్షకు పైగా ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి పరమ్ జిత్ సింగ్ చెప్పారు. పంజాబ్, హర్యానాలలో లోహ్రీ పంటల పండుగను వ్యవసాయ చట్టాలను రద్దు చేశాక జరుపుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ శివార్లలో 26న పరేడ్ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. మొత్తం ఏం జరుగతుందనే ఉత్కంఠ నెలకొంది.
No comment allowed please