KTR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఇది ఒక పండుగలా జరపాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇవాళ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో మహిళా బంధు కేసీఆర్ పేరుతో సంబురాలు చేపట్టాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు కేటీఆర్. అంతే కాకుండా రాష్ట్రంలో 11 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్ పథకం అమలైందని స్పష్టం చేశారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. మన పాలనను చూసి ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 6న మహిళ నాయకులు కేసీఆర్ కు రాఖీలు కట్టాలన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులకు సన్మానం చేయాలన్నారు.
కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవ హారాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. 7న లబ్దిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు.
8న మహిళలతో సమావేశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు కేటీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేశారు.
సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప దార్శనికుడు సీఎం అని కొనియాడారు కేటీఆర్. కేసీఆర్ కిట్ పథకం వల్ల మాతా శిశు మరణాలు చాలా మటుకు తగ్గాయన్నారు.