Rythu Bharosa : రైతులకు అర్జీలు లేకుండానే రైతు భరోసా అంటున్న తెలంగాణ సర్కార్
మరోవైపు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇవ్వడాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది...
Rythu Bharosa : పంటల సాగుతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించింది.పెట్టుబడి సాయం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించరు. రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూములు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. సాగు భూములు ఎన్ని ఎకరాలు అనేది తేల్చేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా(Rythu Bharosa)పై చర్చ సందర్భంగా గతంలో రైతుబంధు కింద 1.53 కోట్ల ఎకరాలకు సాయం అందిందని, అందుకు అయిన ఖర్చు రూ.7,665 కోట్లు అని లెక్క తేలింది. ప్రస్తుతం కొండలు, గుట్టలు, లేఅవుట్లు, సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను తొలగించి రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించారు.. ఇలాంటి భూములు పది శాతం ఉంటాయని ప్రభుత్వ అంచనా.
TG – Rythu Bharosa Updates
ఇవి పోనూ సాగుభూములు సుమారు 1.38 కోట్ల ఎకరాలు ఉంటాయని ఇందుకు రైతు భరోసా(Rythu Bharosa) కింద సుమారు రూ.8,300 కోట్లు అవసరపడతాయని శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అంచనా వేశారు. ఈ మొత్తాన్ని జనవరి 26 నుంచి దశల వారీగా రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు అనేది లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రైతు కూలీల విషయంపైనా మంత్రి మండలిలో చర్చ జరిగింది. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమిలేని కూలీలందరినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించాలని, ఇలాంటి వారు రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. వీరికి ఒక విడతలో రూ.6 వేల చొప్పున, రెండు విడతల్లో ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నారు. మరోవైపు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇవ్వడాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సన్నబియ్యం ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించారు.
రైతు భరోసా అంశంపై గతంలో రూ.10 వేలు ఉండగా దాన్ని రూ.2వేలు పెంచి రూ.12వేలు చేయడంపై చర్చ జరిగింది. రూ.14 వేలు ఇవ్వాలా? రూ.15 వేలు ఇవ్వాలా? అనే చర్చలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక రాబోయే సంవత్సరాల్లో పెంచేలా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ ఏడాదికి అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రొత్సహించడానికి వీలుగా నూతన ఇంధన విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రానున్న కాలంలో 20వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగా సోలార్, పంప్డ్ స్టోరేజ్, పవన విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజ్‌ల రూపంలో గ్రీన్ ఎనర్జీకి ప్రొత్సాహం అందివ్వనుంది. దీని కోసం ప్రభుత్వం రాయితీలను కూడా అందించాలని నిర్ణయించింది.
Also Read : IND vs AUS : కంగారు టీమ్ తో జరిగిన టెస్టుల్లో 5వ మ్యాచ్ లో భారత్ ఓటమి