Rishi Sunak : ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ – సునక్
ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కు కంగ్రాంట్స్
Rishi Sunak : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు తెర తీసిన బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ప్రవాస భారతీయుడు, ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన , దిగ్గజ వ్యాపారవేత్త, మంత్రిగా ఉన్న రిషి సునక్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
మొదటి నాలుగు రౌండ్లలో టాప్ లో నిలిచిన రిషి సునక్ చివరకు ఒపీనియన్ పోల్స్ లో వెనుకబడ్డారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి లిజ్ ట్రస్(Liz Truss) , సునక్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
చివరకు లిజ్ ట్రస్ ఘన విజయాన్ని సాధించారు. ట్రస్ కు 81,326 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రిషి సునక్(Rishi Sunak) కు 60,399 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం విశేషం.
మొత్తం 1,72,437 మంది ఓటర్లు ఉండగా వీరిలో 654 ఓట్లను తిరస్కరించారు. ఫలితం వెలువడిన అనంతరం రిషి సునక్ మీడియాతో మాట్లాడారు. 42 ఏళ్ల వయస్సు కలిగిన సునక్ తన ఓటమిని అంగీకరించారు.
కష్ట సమయాల్లో దేశాన్ని నడిపించేందుకు కొత్తగా నియమితులైన లిజ్ ట్రస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశ అభివృద్ది కోసం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని స్పష్టం చేశారు. గెలుపు ఓటములు సహజమని ఇందులో తాను ఓడి పోయినందుకు బాధ పడడం లేదన్నారు.
అభిప్రాయ భేదాలు, ఆరోపణలు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత అంతా ఒక్కరమేనని పేర్కొన్నారు రిషి సునక్.
Also Read : రిషి సునక్ ఓటమికి వెన్ను పోటు కారణమా