హైదరాబాద్ : చారిత్రక బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్దమైంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర ప్రజలకు ఇక నుంచి రానుందని ప్రకటించారు. చెరువు సుందరంగా తయారవ్వడం పట్ల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు తాము చెరువును ఇంత బాగా పునరుద్ధరిస్తారని ఊహించలేదని రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అన్నారు. ఇప్పుడు చెరువును చూస్తే ముచ్చటగా ఉందని, హైడ్రా పనితనానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బమృకున్ – ఉద్ – దౌలా చెరువును ఆనుకుని ఉన్న కాలనీ వాసులు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని శాలువతో సన్మానించారు.
చెరువు చుట్టూ పాత్ వే, పార్కులు, గజబోలు, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్ ఇవన్నీ ఒకెత్తయితే.. ఆక్రమణలతో కుంచించుకు పోయిన 4.20 ఎకరాలకు పరిమితమై మురికి కూపంగా ఉన్న చెరువును దాదాపు 18 ఎకరాలకు విస్తరించిన తీరు అద్భుతమని కొనియాడారు. పూడికను తీయడమే కాకుండా మురుగు నీరు కలవకుండా తీసుకున్న జాగ్రత్తలతో స్వచ్ఛమైన నీరు ఉందని ప్రశంసలు కురిపించారు. వర్షాకాలం చెరువు నిండితే మరింత అందంగా.. ఆహ్లాదంగా మారుతుందన్నారు. చెరువు నిర్వహణ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్బంగా సూచించారు కమిషనర్ ఏవీ రంగనాథ్.
ఇదిలా ఉండగా 1770లో మూడవ నిజాం సికందర్ జాహ్ పాలనలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ – ఉద్ – దౌలా ఈ చెరువును నిర్మించారని, అందుకే బమృకున్ – ఉద్- దౌలా చెరువు పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవసరాలను తర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలి పోయింది. హైడ్రా 2024 ఆగస్టులో ఆక్రమణలను తొలగించింది. హెచ్ ఎం డీ ఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు అనేక అవరోధాలను అధిగమించి.. విమర్శలను ఎదుర్కొంది. అలా విమర్శించిన వారే ఔరా అనేట్టు హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది.
