Srivaari Mettu : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటిని పునః ప్రారంభించింది టీటీడీ.
ఇటీవల తిరుమలలో భారీ వర్షాలు చోటు చేసుకోవడం, రహదారులు, శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతినడంతో భక్తులకు స్వామి వారిని దర్శించుకునేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.
తాజాగా టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి సంబంధించి భక్తులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఆయన ప్రకటించిన విధంగానే ఇవాళ తిరుమలలో శ్రీవారి మెట్టు (Srivaari Mettu)మార్గాన్ని చైర్మన్ ప్రారంభించారు. గత నవంబర్ నెలలో ఈ మార్గం పూర్తిగా దెబ్బతింది. గతంలో ఉన్న రాతి మెట్లతోనే తిరిగి మరమ్మత్తులు చేపట్టామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి, అమ్మ వార్లను దర్శించు కునేందుకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నడక ప్రయాణానికి పర్మిషన్ ఇస్తామన్నారు.
అంతే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భక్తులకు నిత్య ప్రసాదాలు కూడా అందజేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ దర్శనం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అంతే కాకుండా వృద్దులకు సైతం దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఇదిలా ఉండగా కొంత కాలంగా భక్తులకు ఇబ్బందిగా మారిన శ్రీవారి నడక దారిని పునః ప్రారంభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
Also Read : శ్రీవారి భక్తులకు తీపి కబురు – టీటీడీ