న్యూఢిల్లీ : దేశమంతటా నిత్యం వినియోగించే గ్యాస్ కు సంబంధించి ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఉన్నట్టుండి గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్. వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది. గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అందిస్తామని వెల్లడించింది. LPG ఉత్పత్తిని 25 శాతానికి పెంచామని పేర్కొంది కేంద్రం. హార్ముజ్‌కు సంబంధం లేని రూట్ల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, త్వరలోనే భారత్‌కు రెండు LNG కార్గోలు రానున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి , LPG దిగుమతులపై ఉన్న ప్రతిష్టంభన కారణంగా, విస్తృత కవరేజీని నిర్ధారించడానికి అందుబాటులో ఉన్న సరఫరాలను జాగ్రత్తగా అందజేస్తున్నట్లు తెలిపింది. దేశీయ గృహాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. ఇతర అభ్యర్థనలను బీపీసీఎల్, ఐఓసీ, హెచ్ పీ సీఎల్ నుండి LPG ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంయుక్త కమిటీ సమీక్షిస్తోందని వెల్లడించింది, క్లిష్టత ఆధారంగా కేటాయింపులను పరిశీలిస్తుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కుండ బద్దలు కొట్టింది. సాధారణ సరఫరా పరిస్థితులు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయనే ఆశతో LPG దిగుమతులను ఉచితంగా ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం పాక్షికంగా గ్యాస్ సరఫరా అంతరాయం ఎదుర్కొంటోంద. ప్రభుత్వం దేశీయ సీఎన్జీ, పీఎన్జీ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తోంది. యుద్ధం కారణంగా భారతదేశ సహజ వాయువు సరఫరా పాక్షికంగా ప్రభావితమైంది, రోజుకు దాదాపు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు సరఫరా ప్రభావితమైందని ప్రభుత్వం ధృవీకరించింది.
