తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామి వారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు వెయ్యికి పైగా భజన మండళ్ల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించు కుంటారని చెప్పారు. మార్చి 15న ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారు. సింగపూర్‌కు చెందిన డా. కె. భాగ్యమూర్తి ఆధ్వర్యంలో “అష్టలక్ష్మి విద్యార్థుల బృందం” మెట్లోత్సవంలో పాల్గొంది.
అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేశారు. ఇందులో “బ్రహ్మ కడిగిన పాదము”, “భావములోన బాహ్యమునందును”, “ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు”, “పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా”, “కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు” వంటి కీర్తనలు ఆలపించారు. భక్తులు పరవశించి గోష్టిగానంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత, అన్నమాచార్య వంశీయులు తాళ్లపాక హరి నారాయణాచార్యులు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.
