Ramanujacharya : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో ఏర్పాటైన శ్రీరామనగరం ఆధ్యాత్మికతతో అలరారుతోంది. కుల, మత, వర్గ భేదాలు లేకుండా మనుషులంతా సమానులేనన్న మహనీయుడు శ్రీ రామానుజాచార్యుల(Ramanujacharya )విగ్రహ మహోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి.
ఇప్పటికే దేశం నలుమూలల నుంచి యోగులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, పామరులు, పండితులు, రుత్వికులు, ఆచార్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
వేలాది మంది భక్త జనసందోహం మధ్య యాగం కొనసాగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ సత్ సంకల్ప కార్యక్రమం మహోజ్వలంగా సాగుతోంది.
ఈనెల 14 వరకు జరగనున్న ఈ మహోత్సవాలకు అవాంతరాలు లేకుండా కొనసాగాలని ఆకాంక్షించారు స్వామి వారు. ఈ సందర్భంగా రుత్వికులు, వేద పండితులు, పీఠాధిపతులు వాస్తు శాంతి హోమం చేపట్టారు.
సహస్ర కుండాత్మక మహా లక్ష్మీ నారాయణ యాగం అంగరంగ వైభవంగా సాగింది. దివ్య సాకేత మందిరం నుంచి యాగశాల దాకా శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తుల యాత్ర కన్నులకు కట్టినట్లుగా సాగింది.
వేలాది మంది కళాకారులు ఆకట్టుకున్నారు. ధర్మం నాలుగు పాదాలలో నడవాలంటే సమస్త మానవాళిలో పరివర్తన, మార్పు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.
మనుషుల్లో ఉన్న భేద, ఈర్ష్య భావాలను తొలగించేందుకు వెయ్యేళ్ల కిందటే రామాజునుల వారు ప్రయత్నం చేశారని చెప్పారు. రేపటి నుంచి ప్రతి రోజూ ఉదయం 6-30 గంటలకు యాగశాల వద్ద అష్టాక్షరీ మహా మంత్ర జపం చేస్తామన్నారు చినజీయర్.
ఇవాళ పూర్తయ్యేంత దాకా యజ్ఞాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
Also Read : సమతామూర్తి ఉత్సవం ప్రారంభం