Tirumala Garuda Seva : తిరుమలలో ఘనంగా గరుడ సేవ
ఆషాడ మాస గురు పౌర్ణమి
Tirumala Garuda Seva : ఆషాడ మాస గురు పౌర్ణమి సందర్బంగా తిరుమల లోని శ్రీవారి ఆలయంలో గురు పౌర్ణమి గరుడ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో చేపట్టారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ గుడిని అద్బుతంగా అలంకరించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. భక్తులను ఆశీర్వదించారు.
గరుడ వాహనం సర్వ పాప ప్రాయశ్చిత్తం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసాను దాస ప్రపత్తికి తాను దాసుడని శ్రీవారు తెలియ చేస్తారు.
అంతే కాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించుకుంటే సర్వ పాపాలు, దోషాలు తొలగుతాయని భక్త కోటి విశ్వాసం.
శ్రీ స్వామి వారి గరుడ సేవ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామి కరుణకు పాత్రులయ్యారు. ఇదిలా ఉండగా వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి , ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓ బాలి రెడ్డి పాల్గొన్నారు.
Also Read : Amul Chittoor Dairy : చిత్తూరు డెయిరీ పునరుద్దరణ