#TeluguLegend : నేడు సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు జ‌యంతి

Today Juvvadi Gautama Rao Birthday

ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత.
దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో ఆయనకు గల అనుబంధం, విశ్వనాథను కరీంనగర్ రప్పించి, అక్కడి డిగ్రీ కళాశాల ప్రాచార్యునిగా విధులు నిర్వహించేలా చేసింది. తద్వారా ఉత్తర తెలంగాణకు చెందిన సాహితీవేత్తల సంగమానికి వేదికను ఏర్పరచి, సాహిత్య సుసంపన్నానికి కార్య క్షేత్రాన్ని సిద్దం చేసింది.

ఇలా కరీంనగర్ లో సాహితీ సౌరభాలు గుబాలించ డానికి అహరహం శ్రమించిన సాహితీ ప్రియుడు జువ్వాడి గౌతమరావు. గౌతమ రావు సాహితీ వేత్త నే కాకుండా, స్వాతంత్య్ర పోరాటంలో యోధుడు. సోషలిస్టు భావాలను జీర్ణించుకున్న వ్యక్తి. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. పార్టీ పక్షాన 1977లో పోటీ చేసి ఓటమి చెందాడు.

జువ్వాడి గౌతమరావు (ఫిబ్రవరి 1, 1929 – 2012) కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929, ఫిబ్రవరి 1 న జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర అసామాన్యం, అద్వితీయం. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి.

ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటు పడ్డాడు. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాది మంది సాహితీ కారులకు ఆశ్రయ మిచ్చాడు. ప్రగతి గామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొన్నాడు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జువ్వాడి అత్యంత ఆత్మీయుడు. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షాన్ని శ్రావ్యమైన కంఠంతో తమదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించ గలిగి, అయన మూర్తి తత్వాన్ని ఆవిష్కరించాడు. తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లాడు. జువ్వాడి ప్రోద్బలంతోనే విశ్వనాథ సత్య నారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. విశ్వనాథ ‘భక్తియోగ’ అనే పద్యకావ్య సంపుటిని జువ్వాడి కోసం రాసి అంకితం ఇచ్చారు. ‘కల్పవృక్షంలో కైకేయి’, ‘వేయి పడగలలో విశ్వనాథ జీవితం’ వంటి జువ్వాడి సాహిత్య వ్యాసాలు సాహిత్యలోకంలో సంచలనాలు సృష్టించాయి.

నవ్య సాహిత్యోద్యమ కాలంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్య నారాయణ కొంతకాలం పాటు “జయంతి” అనే సాహిత్య పత్రిక నడిపాడు. తర్వాత దానికి జువ్వాడి సారథ్యం వహించాడు. వివిధ పత్రికల్లో జువ్వాడి రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ వెలిచాల కొండలరావు ‘సాహిత్య ధార’ పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించాడు. జువ్వాడి సాహిత్య కృషికి గాని, సంపాదకత్వం వహించినప్పటి జయంతి పత్రికకు గాని రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. అయినా జయంతి సంపాదకుడిగా ఆయన సంపాదకత్వం పత్రికా రంగానికే వన్నె తెచ్చింది.

నాడు ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న సి.నారాయణరెడ్డి తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే. జీవితమంతా సాహితీ అధ్యయనం తోను, విశ్వనాథ కల్పవృక్ష గానంతోను గడిపాడు. ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్యపీఠం ఆయనకు అంకితం చేసింది.

No comment allowed please