KT Rama Rao : భాష పేరుతో పెత్త‌నం స‌హించం – కేటీఆర్

హిందీ భాష త‌ప్ప‌నిస‌రి చేయ‌డంపై ఆగ్ర‌హం

KT Rama Rao :  దేశ వ్యాప్తంగా మ‌రో ర‌గ‌డ‌కు దారి తీసేలా చేసింది కేంద్రం. మోదీ కొలువు తీరిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో కులాలు, మ‌తాలు, ప్రాంతాల మ‌ధ్య విద్వేషాల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ హిందీ భాష‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని నివేదిక రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించింది.

దీనిపై త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల‌తో పాటు తెలంగాణ లో కూడా నిర‌స‌న‌లు మిన్నంటాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు మంత్రి కేటీఆర్. భాష‌ను ఎంచుకునే హ‌క్కు ప్ర‌జ‌ల‌కే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. భాష పేరుతో పెత్త‌నం చెలాయిస్తానంటే ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు మంత్రి.

మాతృ భాష‌ను వాడుకునే హ‌క్కు భార‌త రాజ్యాంగం క‌ల్పించింద‌ని గుర్తు చేశారు. ఒకే దేశం, ఒకే భాష‌, ఒకే పార్టీ అన్న నినాదంతో బీజేపీ త‌న సిద్దాంతాన్ని అమ‌లు చేయాల‌ని అనుకుంటోంద‌ని కానీ భిన్న భాష‌లు, భిన్న మ‌తాలు , వంద‌ల కులాల‌తో క‌లిసి మెలిసి బ‌తుకుతున్న వారు ఒప్పుకోర‌ని పేర్కొన్నారు కేటీఆర్.

ఇలాంటి ప‌నులు వెంట‌నే ఆపేయాల‌ని ముందు దేశంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. ఇలాంటివి ప్ర‌జ‌ల మ‌ధ్య భావోద్వేగాల‌ను పెంచుతాయే తప్పా ఇంకేమీ ఉండ‌ద‌న్నారు మంత్రి. ఐఐటీలు, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో హిందీని త‌ప్ప‌నిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌జాస్వామ్య విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్(KT Rama Rao).

కేంద్ర స‌ర్కార్ నిర్ణ‌యం పూర్తిగా ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌మైన నిర్ణ‌య‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు మంత్రి. భార‌త దేశానికి త‌ప్ప‌నిస‌రి భాష అంటూ ఏదీ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఈ దేశానికి అంబేద్క‌ర్ అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!