Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డికి కోలుకోలేని షాక్
టీపీసీసీ కమిటీలో నో ఛాన్స్
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా పేరొందారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టడం అలవాటు. ఒక రకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ పరంగా మంచి పేరుండేది. కానీ అనుకోని రీతిలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సోదరుడు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
తన సోదరుడికి అంతర్గతంగా సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీలో ఉంటూ , పదవులు అనుభవిస్తూ వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అంటూ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది హైకమాండ్. దీనికి సరైన సమాధానం ఇవ్వలేదనే సమాచారం. ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయం వైపు తీసుకు వెళ్లేందుకు గాను రాజకీయ, కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రెండు కీలక కమిటీలలో సీనియర్లకు ఛాన్స్ దక్కింది. వీహెచ్ హనుమంత్ రావు, జగ్గారెడ్డికి చోటు దక్కినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రం ఛాన్స్ లభించలేదు.
దీనిపై ఇంకా స్పందించ లేదు కోమటిరెడ్డి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. అంతే కాదు మంత్రిగా కూడా పని చేశారు. ఆపదలో ఎవరున్నా ఆదుకుంటారనే పేరుంది కోమటిరెడ్డి బ్రదర్స్ కు.
Also Read : టీపీసీసీ కీలక కమిటీల ఏర్పాటు