TS High Court : టీఆర్ఎస్ కు హైకోర్టు బిగ్ షాక్
ఎన్నికల గుర్తులపై పిటిషన్ కొట్టివేత
TS High Court : మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక పోలింగ్ జరగడమే మిగిలింది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికలకు సంబంధించి గుర్తుల కేటాయింపు సరిగా లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కోర్టుకు(TS High Court) ఎక్కింది.
ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ ఆరోపణలు చేసినట్లు గుర్తుల కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగదని పేర్కొంటూ దావాను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం. ఒక రకంగా ఇది దెబ్బేనని చెప్పక తప్పదు.
కాగా మునుగోడు ఉప ఎన్నికల ఉచిత గుర్తుల జాబితా నుండి తమ కారు గుర్తుతో సమానమైన ఎన్నికల గుర్తులను తొలగించాలంటూ పిటిషన్ లో పేర్కొంది టీఆర్ఎస్.
దీని వల్ల ఎవరికి ఓటు వేయాలని ఓటర్లు తికమక పడతారని స్పష్టం చేసింది. దీని వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొంది పార్టీ. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ తరపున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విన్నవించామని తెలిపారు.
కానీ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఓటు ఎవరికి వేయాలనేది ఓటర్ల అభీష్టమని తమకు ఇష్టం వచ్చిన కారు గుర్తుకు వేస్తారని ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొచ్చిందటూ ప్రశ్నించింది ధర్మాసనం .
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరూ జోక్యం చేసుకోలేరని ఈసీ న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొట్టివేసింది.
Also Read : అమరావతి రైతన్నలకు రాహుల్ భరోసా