VC Sajjanar : ఆర్టీసీ ఉద్యోగుల శ్రమకు సలాం
మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్
VC Sajjanar : తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్(VC Sajjanar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్టీసీకి విశిష్ట సేవలు అందిస్తున్న ఉద్యోగులను ఆకాశానికి ఎత్తేశారు. వాళ్లు అందరికంటే ఎక్కువగా కష్ట పడుతున్నారని కొనియాడారు. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో పోలీసుల కంటే ఎక్కువగా తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
మెల మెల్లగా ఆర్టీసీ సంస్థ కోలుకుంటోందని పేర్కొన్నారు. మరింత కష్టపడితే త్వరలోనే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలమని స్పష్టం చేశారు ఎండీ. హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాబోయే రోజుల్లో ప్రైవేట్ రవాణా వ్యవస్థ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో సంస్థ పురోగతి కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సజ్జనార్(VC Sajjanar). ఉద్యోగుల సంక్షేమమే ఆర్టీసీ సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు.
ఆ దిశగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని తెలిపారు ఎండీ. ఇదే సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కొత్తగా స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టిందని చెప్పారు సజ్జనార్. గతంలో కంటే ప్రస్తుతం ఆర్టీసీ నిలకడగా ఉందన్నారు.
మెల మెల్లగా అప్పులు లేకుండా చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టానికి వెల కట్టలేమన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన కార్గో సర్వీస్ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది.
Also Read : ఏపీకి టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు