YV Subba Reddy : శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. శనివారం తిరుమలలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ మీటింగ్ లో ఆలయానికి, భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా త్వరగా శ్రీవారి దర్శనం అయ్యేలా చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.
సర్వ దర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)వెల్లడించారు. నడక దారి భక్తులకు దివ్య దర్శనం టికెట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
మహారాష్ట్ర సర్కార్ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించిందని వెల్లడించారు. దీని విలువ రూ. 500 కోట్లు ఉంటుందన్నారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే ఇచ్చేందుకు గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని తెలిపారు. శ్రీవారి మెట్ల ద్వారా నడకను మే 5 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఆలయ ప్రాంగణంలో రెండు బంగారు సింహాసనాలు తయారు చేసేందుకు పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. ఘాట్ రోడ్డుల మరమ్మతుకు రూ. 36 కోట్లు మంజూరు చేసిందన్నారు.
బయో గ్యాస్ ద్వారా అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ తయారీకి ఉపయోగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. శ్రీనివాస సేతు ప్రారంభిస్తామన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఉండేందుకు కాటేజీలు నిర్మించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. తిరుమలలో స్థానికుల సమస్యల పరిష్కారానికి మండలి తీర్మానం చేసిందన్నారు.
Also Read : అక్షరధామ్ ను దర్శించుకున్న బోరిస్ జాన్సన్