#Vangapandu : ప్ర‌జా చైత‌న్యానికి ప్ర‌తిరూపం వంగ‌పండు కు వంద‌నం

త‌ర‌లిరాని తీరాల‌కేగిన చూపున్న పాట

Vangapandu: చూపున్న పాట ఆగిపోయింది. కోట్లాది ప్ర‌జ‌ల ఆర్తిగీతం బోరుమంటున్న‌ది. పేద‌ల క‌న్నీళ్లే గేయాలుగా ఆలాపించిన గొంతుక మూగ బోయింది. జీవితమంతా జ‌నం కోసం బ‌తికిన ఆ స‌మున్న‌త గాయ‌కుడు ఇక రాడు. మ‌ట్టిత‌నం ఆపాదించుకున్న ఆ సిక్కోలు స్వ‌రం ఇక రానంటూ రాలేనంటూ వెళ్లిపోయింది. కాలం మ‌న‌ల్ని కోలుకోలేని గాయాల‌ను చేసింది. అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఎందుకిలా..పాటంటే స‌ప్త‌స్వ‌రాల స‌మ్మేళ‌న‌మే అయి వుండ‌వ‌చ్చు. కానీ పాటంటే ప్ర‌జ‌ల గొంతుక‌. స్వ‌ర‌పేటిక‌. లోకాన్ని స్వ‌రంతో మీటే గాయ‌ప‌డిన గేయం కూడా.

చ‌దువుకునే రోజుల్లో పాట‌పై ..మాట‌పై..చూపుపై ప‌హారా. ఎక్క‌డ చూసినా ఖాకీల దాష్టీకం..లెక్క‌లేన‌న్ని ఎన్ కౌంట‌ర్లు. చెప్పుకోలేని నిర్బంధ‌కాండ‌. మొద‌టిసారిగా పాట‌లే ప్రాణంగా ..జ‌న‌మే ఆయుధంగా చేసుకుని బ‌తికిన ఇద్ద‌రు లెజెండ్స్ ను చూసే భాగ్యం క‌లిగింది. అది ఉమ్మ‌డి రాష్ట్రంలోని హైద‌రాబాద్ న‌డిబొడ్డున జరిగిన భారీ స‌మావేశం. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం. ఒక‌రు గుమ్మ‌డి విఠ‌ల్‌రావు అలియాస్ ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ అయితే..మ‌రొక‌రు గొంగ‌డి భుజాన వేసుకుని..కాళ్ల‌కు గ‌జ్జెలు క‌ట్టుకుని ..ద‌ట్టించిన తూటాలా న‌డిచి వ‌స్తున్న వంగ‌పండును (Vangapandu)క‌ళ్లారా చూశా.

అలాంటి స‌న్నివేశాలు బ‌హుశా అరుదుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. మారుతున్న స‌మీక‌ర‌ణాలు..ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో పెను మార్పులు చోటు చేసుకున్నా..పాట మాత్రం త‌న చూపును కోల్పోలేదు. అది మ‌రింత రాటుదేలుతూనే సామాన్యుల‌కు తోడుగా నిలుస్తోంది. చివ‌రి శ్వాస వ‌ర‌కు ఆయ‌న పాటే ప్రాణంగా బ‌తికాడు. త‌న వార‌స‌త్వాన్ని త‌న కూతురు ఉష‌కు ఇచ్చాడు. తెలుగు నాట ఆయ‌న రాసిన నాట‌కాలు, ఆడి పాడిన పాట‌లు ఇప్ప‌టికీ జ‌నం పాడుకుంటూనే వున్నారు. జాన‌ప‌ద వాగ్గేయ‌కారుడిగా, జ‌న‌నాట్య‌మండ‌లి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా, ఉత్త‌రాంధ్ర గ‌ద్ద‌ర్‌గా ఆయ‌న‌కు పేరుంది.

ఎన్నో పుర‌స్కారాలు, అవార్డులు ఆయ‌న‌ను వ‌రించాయి. కానీ ఆయ‌న మాత్రం త‌న స్వ‌రం మార్చుకోలేదు. ప్ర‌జ‌ల ఆర్తిని పాట‌ల్లోకి ఒలికించిన అరుదైన గాయ‌కుడు. మూడు ద‌శాబ్ధాల‌కు పైగా జ‌నం కోసం ఎన్నో పాట‌లు రాశాడు. పాల‌క వ‌ర్గాల వెన్నులో భ‌యం క‌లిగించేలా గిరిజ‌న బిడ్డ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశాడు. విప్ల‌వ క‌విగా, గాయ‌కుడిగా వినుతికెక్కాడు. ఆర్. నారాయ‌ణ‌మూర్తి తీసిన అర్ద‌రాత్రి స్వ‌తంత్రం సినిమా కోసం వంగ‌పండు(Vangapandu) రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రజలను ఉర్రూతలూగించాడు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడి పాడాడు.

ఆయ‌న‌ను సిక్కోలు జ‌నం త‌మ కోస‌మే బ‌తికిన క‌ళాకారుడు నాజ‌ర్ తో పోల్చుకుంటారు. గద్దర్ తో కలసి 1972లో జన నాట్యమండలిని స్థాపించాడు. వంగ‌పండు(Vangapandu) పాట‌ల‌ను గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించ‌బ‌డ్డాయి.యంత్రమెట్టా నడుస్తు ఉందంటే.. అనే పాట అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది. చిన్నతనంలోచదువు పెద్దగా అబ్బలేదు. బొబ్బిలిలో ఐటీఐ చేశాడు. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే ఆ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఆ యుద్ధం ఆగి పోవడంతో ఊరు బాట పట్టాడు.

అప్పటికే అతని తండ్రి ఊళ్లో భూమి అమ్మేసి రాయగఢ్లో భూమి కొన్నాడు. తన తండ్రికి వ్యవసాయంలో కొంతకాలం తోడుగా ఉన్నాడు. వారి భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు, వారి పదాలు అతని పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని అతనిని పిలిచే వారు. అప్పట్లో అర్థం కాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడు. నక్సల్బరీ ఉద్యమం అతనిలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా ఉద్యమం అతని జీవితం లో ఒక భాగమయింది.

ఆ ఉద్యమంలో ఎంతో మందిని కలిసాడు. ఎందరో కష్టాలను ప్రత్యక్షంగా చూసాడు. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపు కట్టాడు. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే అతనికి ఆత్మ సంతృప్తినిచ్చింది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా అతనికి ఉద్యమం వైపే ఉండేది. దీంతో పది రోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లలో తిరగడం చేసేవాడు. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగాడు. ఇలా తిరుగుతూ ఉంటే ఇంట్లో పూట గడవని స్థితి ఏర్పోడింది.

ఒక పూట తింటే మరో పూట పస్తు ఉండే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే అతను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ళు సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో కొనసాగాడు. మధ్యతరగతి కుంటుంబాలకు ఉద్యమాలు సరిపోవని అనుకున్నాడు. ఉద్యోగం వదులుకున్నప్పుడు ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచనలో ప‌డ్డాడు. మళ్లీ కొన్నాళ్లు స్వంత గ్రామంలో వ్యవసాయం చేశాడు కానీ కలిసి రాలేదు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపు కోకూడదనిపించి మళ్లీ ఉద్యమం బాటే పట్టాడు.

30 సినిమాల వరకు పాట‌లు రాశాడు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాడు. వంగ‌పండుకు(Vangapandu) శివుడంటే ఇష్టం. శివుని మీద ‘ఓమ్‌ ఉమా శంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాడు. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టాడు. అలాగని, ఏనాడూ శివాలయానికి వెళ్లిందీ లేదు. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఊపిరి ఆగేంత దాకా త‌ను న‌మ్మిన సిద్ధాంతం కోసం బ‌తికిన ప్ర‌జాగాయ‌కుడు..స్వ‌ర సంచారి ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు. ఆయ‌న రాసిన‌ట్టే త‌రం వెళ్లిపోతున్న‌ది..నాటి స్వ‌రం ఆగిపోతున్న‌ది అనుకుంటూ పాడుకోవ‌డ‌మే మ‌న‌కు మిగిలింది. క‌న్నీళ్ల‌తో వంగ‌పండుకు వందనం..!

No comment allowed please