Vijay Sai Reddy : విజయ సాయి రెడ్డికి కీలక పదవి
రవాణా, పర్యాటకం, సంస్కతిపై స్టాండింగ్ కమిటీ చైర్మన్
Vijay Sai Reddy : వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ విజయ సాయి రెడ్డికి(Vijay Sai Reddy) అరుదైన గౌరవం లభించింది. ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవి వరించింది. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయ సాయి రెడ్డి నియమితులయ్యారు.
ఉపరితల రవాణా, పౌర విమానయానం, షిప్పింగ్ , పర్యాటకం, సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయ సాయి రెడ్డిని నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన శాఖలు, సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుండి అమలు లోకి వచ్చేలా పునర్నిర్మించ బడిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదిలా ఉండగా తనను నియమించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
తనపై అపారమైన విశ్వాసం చూపినందుకు ప్రధాన మంత్రికి, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి రెడ్డి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా తన బాధ్యతలను అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
Also Read : కశ్మీర్ లో రిజర్వేషన్ కోటా వర్తింపు