Waqf Bill: రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లుకు పచ్చజెండా
రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లుకు పచ్చజెండా
Waqf Bill : దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన ఈ బిల్లు… ఎగువసభ అయిన రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. బుధవారం లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు… గురువారం రాజ్యసభకు చేరింది. ఈ బిల్లుపై అర్ధరాత్రి దాటే వరకూ విస్తృత చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. దీనితో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు.
Waqf Bill Got Green Signal from Rajya Sabha
ఈ సందర్భంగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ… వక్ఫ్ చట్ట సవరణ బిల్లు(Waqf Bill) ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకత తీసుకురావడం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు(Waqf Bill) పనితీరు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్నివర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తేనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాల కోసమే ఈ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. మద్దతివ్వాల్సిందిగా విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ముస్లిం హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తోన్న ఆరోపణలను రిజిజు తోసిపుచ్చారు. ముస్లింలలోని షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు(Waqf Bill) సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు.
కాగా వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. వక్ఫ్ బిల్లు పేరును…యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది. దీనితో పాటు ‘ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లు’ను కూడా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది.
కాంగ్రెస్ పై బీజేపీ అధ్యక్షుడు నడ్డా ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ హయాంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని బీజేపీ(BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా(JP Nadda) దుయ్యబట్టారు. వారి హక్కులను గుర్తించలేదని చురకలు వేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు సగౌరవంగా జీవించేలా చేసిందని తెలిపారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతను తీసుకొచ్చే బిల్లును తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తుర్కియే, మలేసియా, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు ప్రత్యేక చట్టాల ద్వారా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వాల నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేలా చేశాయని తెలిపారు. 1913-2013 మధ్య 18 లక్షల హెక్టార్ల భూమి వక్ఫ్‌ల కింద ఉండగా 2013-2025 మధ్య కాలంలో ఆ మొత్తం 21 లక్షల హెక్టార్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆ ఆస్తులను తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. వాటిని దుర్వినియోగం కాకుండా చూడటమే బిల్లు లక్ష్యమని వివరించారు. మాజీ ప్రధాని, జనతా దళ్ (సెక్యులర్) అగ్రనేత హెచ్.డి.దేవేగౌడ బిల్లును సమర్థించారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (శిందే), జనసేన పార్టీలు కూడా మద్దతిచ్చాయి.
వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరోపించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ(BJP) ఈ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్… అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదన్నారు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించేలా ఈ బిల్లు ఉందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభ విపక్ష నేత, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.
దేశంలో నెలకొన్న మతసామరస్యాన్ని దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. అన్ని మతాలను సమానంగా చూడాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ కేంద్రానికి సూచించారు. పలు సందేహాలకు తావిస్తోన్న వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వానికి తొందర ఎందుకని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రశ్నించారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన బిజూ జనతా దళ్ (బీజేడీ)… పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. సభ్యులు తమ ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయవచ్చని సూచించింది. అయితే, రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ ముజిబుల్లా ఖాన్… వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), వామపక్షాలు, టీఎంసీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.
వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే – సీపీపీ భేటీలో సోనియా గాంధీ
వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్ సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్ లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు.
Also Read : CM Mamata Banerjee: 25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు