KTR : తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్
వెల్లడించిన రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి
KTR : రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మంత్రి ఆధ్వర్యంలోని బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటోంది. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు.
ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఎంఎన్ఆర్ఏ వ్యాక్సిన్ హబ్ ను త్వరలోనే తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇది తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ల తయారీలో తమ రాజధాని కేరాఫ్ గా మారిందని చెప్పారు.
పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నామని తెలిపారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలకు చెందిన పలు కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో కొలువు తీరాయని, దీని వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
లైఫ్ సైన్సెస్ కు తాము పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మూడో వంతు వ్యాక్సిన్లు తమ రాష్ట్రంలో తయారవుతున్నాయని ఇది తమకు గర్వ కారణంగా ఉందన్నారు. అంతే కాదు 40 శాతం ఫార్మసీకి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడే తయారు అవుతున్నాయని వెల్లడించారు కేటీఆర్. కరోనానే కాకుండా ఇతర ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తికి తమకు ఉందన్నారు మంత్రి(KTR).
ప్రధానంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరామని తెలిపారు కేటీఆర్.
Also Read : చైనా దిగుమతులు భారత్ కు కష్టాలు