ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే మరణించిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో అయితే ఆ ఎమ్మెల్యేపై గౌరవంతో ఎవరూ పోటీచేసే వారు కాదు.. అప్పుడు భార్య లేదా కుమారుల గెలుపు నల్లేరుపై నడకలా ఉండేది. ఇప్పుడు కాలం మారింది. రాజకీయాల్లో ఉన్న ఆ కాస్త విలువలు పోయాయి. అందుకు నిదర్శనంగా ప్రధాన పార్టీలు పోటీలోకి దిగాయి.
అయితే తెరాస తరఫు నుంచి.. మరణించిన ఎమ్మెల్యే సతీమణి సోలిపేట సుజాతను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో అంతవరకు తెరాస పార్టీనే నమ్ముకుని, నియోజకవర్గంపై మంచి పట్టున్న దివంగత మంత్రి చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి రాత్రికి రాత్రి ఆహ్వానించి సీటిచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. నిజానికి ఆ సీటును తెరాసలో శ్రీనివాసరెడ్డి ఆశించి భంగపడి ఇలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత బీజేపీ విషయానికి వస్తే దుబ్బాక నుంచి పోటీచేసి రెండుసార్లు ఓడిపోయిన సీనియర్ నేత ఎన్.రఘునందన రావునే మళ్లీ నిలబెట్టింది.
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీపై ప్రజలకు ఉన్న అభిమానం, తెరాస వైఫల్యాలు, తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావనతో నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతోంది. కరోనాపై చేతులు ఎత్తేయడం తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతలను హరీష్ రావు చూసుకోవడం, సింపతీ ఓట్లు, మంచినీళ్లు, ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయని తెరాస భావిస్తోంది. మొత్తానికి పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతోంది.