అమరావతి : సృష్టికి మూలం మహిళలేనని, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు అని కొనియాడారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడికి వచ్చిన మహిళలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. తెలుగింటి ఆడబిడ్డలకు, దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీలను ప్రేమించి, పూజించిన చోట సంపదకు లోటు ఉండదన్నారు సీఎం. సీఎంగానే కాదు వ్యక్తిగా ఆడబిడ్డలను ప్రోత్సహించి పైకి తీసుకొచ్చేందుకు సర్వశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైందని, మార్చి 8న ప్రతి ఏటా జరుపుకుంటున్నాం అని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. ఈసారి కొత్త థీమ్ తీసుకొచ్చారని, రైట్స్, జస్టిస్, యాక్షన్ మహిళా హక్కులన్నీ కాపాడటం, న్యాయం చేయడం, ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడానికి ఈ మార్గాలు అవలంభించాలని అన్నారు.
ప్రస్తుతం తమ కూటమి కేబినెట్ లో ముగ్గురు మహిళలు మంత్రులుగా ఉన్నారని, వారు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు సీఎం. దేశ అధ్యక్షురాలిగా గిరిజన మహిళ ఉన్నారని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మన ఆడబిడ్డేనని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని సమర్థవంతగా వినియోగించే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు ఆడబిడ్డలేనని ప్రశంసలు కురిపించారు. బడ్జెట్ రూపకల్పనకు మహిళలు మారుపేరు అన్నారు సీఎం. నిర్మలా సీతారామన్ దేశానికి ఆర్థిక మంత్రిగా అద్భుతుంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. సమర్థవంతంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఏపీ హైకోర్టుకు కూడా సీజేగా మహిళ వస్తున్నారని తెలిపారు. తాను ఎప్పుడూ మహిళా పక్షపాతినేనని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
