NCW Adhir Ranjan : అధిర్ రంజన్ కు మహిళా కమిషన్ నోటీసులు
రాష్ట్రపత్ని అంటూ చేసిన కామెంట్స్ కు
NCW Adhir Ranjan : భారత సర్వోన్నత పదవిలో ఆసీనులైన ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పట్ల అనుచిత, అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ మహిళా కమిషన్.
ఈ మేరకు ఎంపీకి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ. రాష్ట్రపతి పట్ల చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, అత్యంత అవమానకరమని పేర్కొన్నారు.
ఈ మేరకు ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
మహిళల పట్ల ఆయనకు ఉన్న ఆలోచనలు ఏమిటో దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు. అంతే కాకుండా అధిర్ రంజన్ చౌదరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కోరారు రేఖా శర్మ.
ఇదిలా ఉండగా తన కామెంట్స్ పరంగా మనస్సు నొప్పిస్తే తాను రాష్ట్రపతికి క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు అధిర్ రంజన్ చౌదరి(NCW Adhir Ranjan).
అయితే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలకు మాత్రం కాదన్నారు. సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తనకు హిందీ సరిగా రాదని, తాను బెంగాలీనని తెలిపారు.
జాతీయ మీడియా ఏఎన్ఐతో రేఖా శర్మ మాట్లాడారు. భారత రాష్ట్రపతిని ఉద్దేశించి ఎంపీ ఇలా మాట్లాడటం సరికాదు. ఈ వ్యాఖ్యలు బాధాకరమైనవి. మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం అవుతుందన్నారు.
Also Read : ఎంపీల ఆందోళన కొనసాగుతున్న నిరసన