తాము తిరిగి రాజస్థాన్ లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆయన అంతర్గత పోరు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఏకంగా అవినీతిపై యుద్దం ప్రకటించారు. ఆపై సీఎంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. పైలట్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది హైకమాండ్.
మాజీ డిప్యూటీ సీఎంపై సీరియస్ గా స్పందించింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అంతర్గత సమావేశాలలో ప్రస్తావించాలే తప్పా బయట విమర్శించ కూడదంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన పనులే తమను తిరిగి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్.
ఇదిలా ఉండగా సచిన్ పైలట్ విషయంపై ప్రత్యేకంగా మీడియా ప్రస్తావించింది. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సీఎం. మమ్మల్ని తిరిగి గొడవ పడేలా చేయొద్దంటూ సూచించారు. తమకు పూర్తి నమ్మకం ఉందని , గొడవలు, అభిప్రాయ భేదాలు సహజమని పేర్కొన్నారు అశోక్ గెహ్లాట్. తాము ఇతర నాయకుల గురించి పట్టించు కోవడం లేదన్నారు. కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నామని చెప్పారు.