Indus Waters Treaty: ‘సింధు జలాల ఒప్పందం’పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

‘సింధు జలాల ఒప్పందం’పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Indus Waters Treaty : పహాల్గాం ఉగ్రదాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన పాకిస్తాన్ పై భారత్ ప్రభుత్వం ప్రతీకార చర్యలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దాయాది దేశం పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వం దిగ్బంధిస్తోంది. దీనిలో భాగంగా సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసినట్లు ప్రకటించింది. అనంతరం ఆపరేషన్ సిందూర్(Operational Sindoor) తో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీనితో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సింధుజలాల ఒప్పందం అమలును నిలిపివేతపై తాజాగా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా(Ajay Banga) స్పందించారు. ‘‘ఈ ఒప్పందం విషయంలో ప్రపంచబ్యాంక్‌ జోక్యం చేసుకొని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవన్నీ అర్థం లేనివి. ఈ బ్యాంక్‌ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుంది’’ అని బంగా స్పష్టం చేశారు.

Indus Waters Treaty International Bank Responds

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా ప్రస్తుతం భారత్‌ లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌తో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఆయన మనదేశంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌ గా, సిక్కు అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉంటే… సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్‌ ఎకరాల అడుగులు (ఎమ్‌ఏఎఫ్‌)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి.

సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని భారత్‌ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి, ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో, తాగు, సాగు నీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయనీ, పర్యావరణ, భౌగోళిక, రాజకీయపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్‌ స్పష్టంచేసింది. అయితే, దీనిపై పాక్‌ మాత్రం వ్యతిరేకత వ్యక్తంచేస్తూ వస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గాం దాడితో ఈ ఒప్పందం అమలును భారత్‌ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

Also Read : Enforcement Directorate: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు ! రంగంలోకి ఈడీ !

Leave A Reply

Your Email Id will not be published!