#YahooNewLook : యాహూ కొత్తగా గమ్మత్తుగా
జీ మెయిల్ కు ధీటుగా యాహూ మెయిల్
Yahoo New Look : ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడి పోయింది. అయితే, పూర్వ వైభవాన్ని సంపాదించు కునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యాహూ మెయిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించు కుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాల వారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరోఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమ వద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 300 సినిమాలకు సరి పడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని, ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది.
ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదర బందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించు కోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించు కోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించు కోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
No comment allowed please