#TrumpYouTube : ట్రంప్ యూట్యూబ్ ఛానల్ స్టాప్
ట్రంప్‌కు సామాజిక మాధ్యమాల ఝలక్
Trump YouTube : అమెరికా చరిత్రలో అత్యంత అవమానకరమైన రీతిలో అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్ కు అంతటా ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లు ట్రంప్ వ్యక్తిగత ఖాతాలను నిషేధించాయి. గూగుల్ కూడా వీటి బాటనే పట్టింది. తన సంస్థకు చెందిన యూట్యూబ్ లో ట్రంప్ హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉండడంతో తాత్కాలికంగా ఆయన ఛానల్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ తాజాగా పోస్టు చేసిన వీడియో తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని యూట్యూబ్ ట్వీట్ చేసింది.
అయితే ఆ వీడియో ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయన హింసను ప్రేరేపించేలా పోస్టులు పెడుతున్నట్లు వెల్లువలా ఫిర్యాదులు అందుతున్నాయి. ట్రంప్ ఛానల్‌లో కొన్ని వీడియోలను తొలగించాం. మొదటి హెచ్చరికగా వారం రోజుల పాటు నిషేధిస్తున్నామని తెలిపింది. నిబంధనల ప్రకారం మళ్లీ ఇలాంటి పోస్టులు చేస్తే రెండు వారాల పాటు బ్యాన్ ఉంటుంది. మూడోసారి అదే తప్పు చేస్తే శాశ్వతంగా తొలగిస్తుంది యూట్యూబ్. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన మిలటరీ అప్రమత్తమైంది.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ అమెరికన్లకు పిలుపు ఇచ్చింది. ట్రంప్ అనుచరులు హింసకు పాల్పడనున్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే నివేదించాయి. దీంతో యుఎస్ మిలటరీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆర్మీ ఇలా ప్రకటించడం చాలా అరుదు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామంటూ ప్రకటించింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందంటూ విన్నవించింది.
No comment allowed please