విధి నిర్వహణలో ఉన్న ఖాకీలపై దౌర్జన్యం చేసిన వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు కోలుకోలేని షాక్ తగిలింది. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించడం, ఎస్ఐ రవీందర్ ను నెట్టడం తో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
వైఎస్ షర్మిలతో పాటు డ్రైవర్ కు కూడా పరీక్షలు చేపట్టారు. తను కారులో కూర్చుని డ్రైవర్ ను పోలీసులపై కారు పోనివ్వాలంటూ చెప్పడం అంతా రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోమవారం మొత్తం సోషల్ మీడియాను షేక్ చేశాయి.
రాష్ట్రంలో శాంతి భద్రతలు భద్రంగానే ఉన్నాయంటూ పదే పదే చెబుతున్న తెలంగాణ పోలీసులకు వైఎస్ షర్మిల ప్రవర్తించిన తీరు తలవంపులు తెచ్చేలా చేసింది. దీనిపై డీజీపీ సీరియస్ గా స్పందించారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్ఐ రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్ షర్మిలపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
ఈ సందర్భంగా వింత వాదన వినిపించారు మేడం. తాను పోలీసుల పట్ల అమర్యాదగా ప్రవర్తించ లేదని, తన పట్ల వారే దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. షర్మిలకు సంబంధించిన మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను, ఫోటోలను జడ్జి ముందు ఉంచారు పోలీసులు. అంతా గమనించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
