తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక సలహాదారులు ఎందుకు అని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని ఏకి పారేశారు. ప్రజా ధనాన్ని అప్పనంగా దోచి పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను స్పెషల్ అడ్వైజర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్నటికి మొన్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని తీసుకు వచ్చి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడని ఆయనకు నెలకు లక్షన్నర జీతం ఎందుకని ప్రశ్నించారు. ఇక కేబినెట్ హోదాలో సోమేశ్ కుమార్ ను నియమించడం దారుణమన్నారు. ఆయనకు రెండున్నర లక్షల జీతం ఎందుకని ప్రశ్నించారు. ఏం చేశాడని గౌరవ సలహాదారుగా పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
చెవిటోని ముందు శంఖం ఊదినట్లు ..సలహాలు తీసుకునేందుకు ఇష్ట పడని దొర కేసీఆర్ కు సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం రాచరిక పాలన నడుస్తోందని ఆవేదన చెందారు షర్మిల. ఓ వైపు నిరుద్యోగులు జాబ్స్ లేక నానా తంటాలు పడుతుంటే ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
