YS Sharmila Arrest : పోలీసుల‌పై దౌర్జ‌న్యం ష‌ర్మిల అరెస్ట్

నాలుగు సెక్ష‌న్ల మ‌ధ్య కోర్టుకు త‌ర‌లింపు

వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీల‌పై దౌర్జ‌న్యం చేయ‌డంతో పాటు విధుల‌కు ఆటంకం క‌లిగించినందుకు ష‌ర్మిల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఎస్ఐ ర‌వీంద్ర ఫిర్యాదు చేశారు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ పై కూడా దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో రాష్ట్ర డీజీపీ సీరియ‌స్ అయ్యారు. విధుల్లో ఉన్న వారి ప‌ట్ల ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా ఎస్ఐ ర‌వీంద‌ర్ ఇచ్చిన ఫిర్యాదు తో వైఎస్ ష‌ర్మిల‌పై నాలుగు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్ష‌న్ల కింద న‌మోదు చేశారు. ఇందిరా పార్క్ వ‌ద్ద దీక్ష చేప‌ట్టేందుకు పార్టీ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వెళుతుండ‌గా పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ష‌ర్మిల‌కు పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇదే స‌మ‌యంలో ఆమె దూకుడు పెంచారు. ఏకంగా మ‌హిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. చెంప ఛెళ్లుమ‌నిపించారు.

ఆపై అరుచుకుంటూ వెళ్లారు. అంద‌రూ చూస్తూ ఉండ‌గానే ఎస్ఐ భుజాన్ని నెట్టి వేసే ప్ర‌య‌త్నం చేశారు.
దీనిని నిర‌సిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పీఎస్ కు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి వైద్య ప‌రీక్ష‌లు చేసి ..నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు.

Leave A Reply

Your Email Id will not be published!