రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అక్కడి ప్రజలు తమ తీర్పును ప్రకటించారని, ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని చాటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడానికి కేవలం ఒకే ఒక్క నినాదం బాగా పని చేసిందని చెప్పారు. ఆ నినాదం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా శాశ్వతం కాదని , ప్రజలే అంతిమ నిర్ణేతలు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం సచిన్ పైలట్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
కర్ణాటకలో బొమ్మై సర్కార్ ప్రతి పనికి కమీషన్ ఇవ్వాలని నిర్ణయించిందని, ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపిందన్నారు. దీనిని గుర్తించి ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో అక్కడి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యిందని ఇదే ఓటు బ్యాంకుగా మారిందని తెలిపారు సచిన్ పైలట్. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సేవలు అందిస్తే ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా త్వరలో రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా ఉంది.
