Sri Lanka Crisis : ప్రజాగ్రహం ముందు పాలకులు బలాదూర్
శ్రీలంక పాఠం భారత దేశానికి గుణపాఠం
Sri Lanka Crisis : అధికారం ఉంది కదా అని పాలకులు మితిమీరి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. ప్రజల్ని అమాయకులని అనుకోవడం, కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ నాయకులకు చెంప పెట్టు నేడు శ్రీలంక(Sri Lanka Crisis) దేశంలో చోటు చేసుకున్న ప్రజాగ్రహం.
జనం నివురుగప్పిన నిప్పుల్లాగా ఉంటారు. ఓపిక వహించినంత వరకు వాళ్లు ఎవరినీ ఏమీ అనరు. కానీ ఏదో ఒక రోజు కోపం కట్టలు తెంచుకున్న రోజున ఎన్నుకున్న ప్రభుత్వాలు, ఎంపికైన పాలకులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగిన వాళ్లు ఏదో ఒక రోజు సలాం చేయాల్సిందే.
తల వంచాల్సిందే. తర తరాల చరిత్రలో ఇది నిజం అని నిరూపితమైంది. ప్రభుత్వాలు ఏ రకంగా ఏర్పడినా , చివరకు రాచరిక పాలనైనా ప్రజలే జెండా.
వారి ఆశల్ని వంద శాతం తీర్చలేక పోయినా కనీసం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తే కొంత మేరకు మేలు. కానీ అడ్డగోలుగా దేశానికి చెందిన సంపదను, వనరుల్ని తమ వారికి కట్ట బెడతామంటే ఊరుకోరు ఈ ప్రజలు.
వారిని అమాయకులని అనుకోవడం ఒట్టి భ్రమ. నిన్నటి దాకా రాజభవనంలో ఉంటూ అధికార మదంతో దిగిపోమ్మంటూ కోరినా పట్టించుకోని శ్రీలంక దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్సె ప్రాణభయంతో పారి పోవాల్సి వచ్చింది.
చివరకు తాను ఏ భవనంలో ఉన్నాడో ఆ అందాల రాజసౌధం కాపాడలేక పోయింది. అందుకే ప్రజలు శాశ్వతం. దేశం శాశ్వతం. పాలకులు అశాశ్వతం అని తెలుసుకోవాలి. లేక పోతే శ్రీలంక పాఠం భారత్ కు వర్తిస్తుంది.
Also Read : ముదిరిన సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం