OLA CEO : ఉబెర్ తో ఓలా విలీనం అబద్దం – సిఇఓ
స్పష్టం చేసిన భవిష్ అగర్వాల్
OLA CEO : ఉబెర్ తో ఓలాను విలీనం చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేశారు ఓలా సిఇఓ భవిష్ అగర్వాల్(OLA CEO). ఈ సందర్భంగా శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు సిఇఓ.
ఇతర కంపెనీలు తమ వ్యాపారాన్ని భారతదేశం నుండి వైదొలగాలని కోరుకుంటే తాము స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. అంతే కానీ ఇంకో సంస్థతో తాము విలీనం చేసుకునే ప్రసక్తి లేదన్నారు.
ఉబెర్ తో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వస్తున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదన్నారు భవిష్ అగర్వాల్.
తమ సంస్థ రోజు రోజుకు విస్తరిస్తోందని, లాభాలు గడిస్తోందని ఈ తరుణంలో ఇంకో సంస్థతో ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు ఓలా సిఇఓ.
అంతే కాకుండా అమెరికన్ రైడ్ హెయిలింగ్ సంస్థతో తాము ఇప్పటి వరకు ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోలేదన్నారు. అది కూడా నిరాధారమైన ప్రచారంగా కొట్టి పారేశారు భవిష్ అగర్వాల్.
ఇదిలా ఉండగా ప్రముఖ అంతర్జాతీయ ఏజెన్సీ రాయిటర్స్ ఓలా, ఉబెర్ విలీనం చేసుకునే దిశగా పరిశీలిస్తున్నట్లు నివేదించింది. ఎకనామిక్ టైమ్స్ కూడా ఈ నివేదికను పూర్తిగా కొట్టి పారేసేందుకు వీలు లేదని పేర్కొంది.
దీంతో పెద్ద ఎత్తున మార్కెట్ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఉబెర్, ఓలా కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.
ప్రధానంగా భారత్ లో వీటి మార్కెట్ వాటా బలంగా ఉంది. ప్రయాణీకులకు ప్రోత్సాహకాలు, తగ్గింపుల కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి.
Also Read : ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఎలోన్ మస్క్ దావా