Krishnam Raju Comment : విల‌క్ష‌ణ న‌టుడు కృష్ణంరాజు

తెలుగు సినిమాకు తీర‌ని లోటు

Krishnam Raju Comment : ఒక శకం ముగిసింది. ఒక్క‌రొక్క‌రూ వెళ్లి పోతున్నారు. త‌మ దారిని తాము చూసుకుంటూ. త‌మ జ్ఞాప‌కాల‌ను వ‌దిలి వేసి వెళ్లి పోవ‌డం చెప్ప‌లేని బాధ‌ను మిగుల్చుతోంది.

కానీ మాన‌వ జీవితంలో ఇది స‌హ‌జం. ఎలా జీవిస్తామ‌న్న‌ది ప‌క్క‌న పెడితే మ‌ర‌ణాన్ని చివ‌రి వ‌ర‌కు ఆస్వాదించాల్సిందే. కొంద‌రిని కోల్పోయిన‌ప్పుడు కొంచం క‌ళ్లు చెమ్మ‌గిల్లుతాయి.

ఎందుకంటే ఏమ‌ని చెప్ప‌లేం. దుఖఃం చెప్పి రాదు. సంతోషం వ‌స్తాన‌ని చెప్ప‌దు. అందుకే సినీ క‌వి ఊరికే రాయ‌లేదు. ఈ జీవ‌న త‌రంగాల‌లో ఎవ‌రికి ఎవ‌రు స్వంతం అని రాశాడు.

తెలుగు సినిమా రంగంలో త‌మ‌దైన ముద్ర‌ను వేసిన వారిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , న‌ట శేఖ‌రుడు కృష్ణ అయితే ఆ త‌ర్వాత ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది కృష్ణంరాజు.

82 ఏళ్ల పాటు జీవించిన ఆయ‌న ప్ర‌యాణంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. జ్ఞాప‌కాలు కూడా ఉన్నాయి. న‌టుడిగా విల‌క్ష‌ణమైన ప్ర‌తిభ‌తో రాణించాడు.

ప్ర‌తి నాయ‌కుడి నుంచి హీరోగా త‌న‌ను తాను మ‌లుచుకున్నాడు. ఆయ‌న చివ‌రి చిత్రం త‌న‌యుడితో క‌లిసి న‌టించిన రాధే శ్యామ్. ద‌ర్శ‌కుడు ఒప్పించి మ‌రీ న‌టించేలా చేశాడు.

ఏదో ఒక రోజు పోవాల్సిందే. అక్క‌డికి చేరుకోవాల్సిందే. ఆ మ‌ధ్య‌లో మ‌నం చేసిన ప‌నులే మ‌నల్ని త‌లుచుకునేలా చేస్తాయి. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణం రాజు(Krishnam Raju).

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మొగ‌ల్తూరు ఆయ‌న స్వంతూరు. ఆయ‌న‌కు రెబ‌ల్ స్టార్ అన్న పేరుంది. మొద‌ట జ‌ర్న‌లిస్ట్ గా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత న‌టుడ‌య్యారు.

అనంత‌రం రాజ‌కీయ నాయ‌కుడిగా ఉండి పోయారు. ముగ్గురు కూతుళ్లు. సోద‌రుడి త‌న‌యుడే ప్ర‌భాస్ . అత‌డంటే ఆయ‌న‌కు పంచ ప్రాణం. చిత్ర నిర్మాత కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు.

ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. ఎక్క‌డా వివాదాల జోలికి వెళ్ల‌లేదు. అదే కృష్ణంరాజును నిల‌బెట్టేలా చేసింది. మూడు పార్టీలు మారారు.

మొద‌ట కాంగ్రెస్, బీజీపీ, ప్ర‌జారాజ్యంలో చేరారు. ఆ త‌ర్వాత దూరంగా ఉంటూ వ‌చ్చారు. రాజుల కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో ఆయ‌న వ్య‌క్తిత్వం కూడా ఉన్న‌తంగా ఉండేది.

పైకి గాంభీర్యం ప్ర‌ద‌ర్శించినా ఆయ‌న మ‌న‌స్సు ఎరిగిన వారు మాత్రం భోళా శంక‌రుడు అంటారు. ఏది ఏమైనా కృష్ణం రాజు(Krishnam Raju) గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

తెలుగు సినిమా రంగానికి ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోటు. పూడ్చ లేని అగాధం కూడా. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Also Read : అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Leave A Reply

Your Email Id will not be published!