Calcutta High Court : హింసాత్మకంపై నివేదిక కోరిన కోర్టు
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన బీజేపీ నిరసన
Calcutta High Court : పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియేట్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి కోల్ కతా హైకోర్టు(Calcutta High Court) వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టీఎంసీ సర్కార్ పాలన పూర్తిగా అవినీతి, అక్రమాలకు తెర లేపిందని దీనిని నిరసిస్తూ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు.
పోలీసులు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నబన్న చలో పేరుతో చేపట్టిన ఈ ఆందోళన తో పరిస్థితి విషమించడంతో బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు వ్యానులో తరలించారు. కోల్ కతా వీధుల్లో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి.
ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు పోలీసు వాహనానికి నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు.
ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి నివేదికను సెప్టెంబర్ 19 లోగా తమకు సమర్పించాలని కోల్ కతా న్యాయ స్థానం పశ్చిమ బెంగాల్ హోం శాఖ కార్యదర్శిని ఆదేశించంది.
ఏ వ్యక్తిని చట్ట విరుద్దంగా నిర్బంధించ వద్దని , ప్రజల ఆస్తులకు భంగం జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు.
వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి రావడంతో కోల్ కతా లోని కొన్ని ప్రాంతాలు రణరంగంగా మారాయి. లాల్ బజార్ లో పోలీసు వాహనాన్ని తగులబెట్టగా సంత్రాగచ్చిలో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
Also Read : జేడీయూకు షాక్ స్పోక్స్ పర్సన్ రిజైన్