5G Comment : 5జీ టెక్నాలజీ వల్ల ఉపయోగమెంత..?
సాంకేతిక విప్లవమా లేక వినాశమా
5G Comment : దేశమంతటా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైస్పీడ్ కనెక్టివిటీ కలిగిన 5జీ టెక్నాలజీ(5G). దేశ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ లో భాగంగా డిజిటల్ ఇండియాగా మార్చడం తన ముందున్న ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే దేశంలో 4జీ టెక్నాలజీ కొనసాగుతోంది. విస్తృతంగా కనెక్టివిటీ కలిగి ఉంది.
కాగా 5జీ టెక్నాలజీతో ఇంటర్నెట్ వినియోగం అనేది రాకెట్ కంటే వేగంగా ఉంటుందని టెలికాం దిగ్గజ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కేంద్ర
ప్రభుత్వం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించింది. భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. మరో వైపు ప్రభుత్వ ఆధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
(బీఎస్ఎన్ ఎల్ ) మాత్రం నిరాదరణకు లోనైంది.
దేశంలో వేలాది మంది నైపుణ్యం కలిగిన వారున్నా ఎందుకని ప్రభుత్వ సంస్థ నష్టాల్లోకి చేరిందనేది ఏలిన వారే చెప్పాల్సి ఉంది. ఇక మోదీ ప్రభుత్వం
కొలువు తీరాక షావుకార్లకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు లేక పోలేదు.
ఇది పక్కన పెడితే ఇప్పుడు 5జీ టెక్నాలజీ మొత్తం బడా సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన రిలయన్స్ జియో, ఎయిర్
టెల్ , వొడా ఫోన్ ఐడియా , ఎరిక్ సన్ చేతుల్లోకి వెళ్లింది. ఇందులో ఎక్కడా బీఎస్ఎన్ఎల్ పేరు లేదు. ఇక వాళ్లు ఏది నిర్ణయిస్తే అదే ధర. ఇందులో వినియోగదారుల ప్రమేయం అంటూ ఉండదు.
5జీ టెక్నాలజీ(5G Service) వెనుక చీకటి కోణాలు కూడా లేక పోలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి కొన్ని నగరాలకే పరిమితం కాగా
వచ్చే ఏడాది 2023 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందజేస్తామంటోంది రిలయన్స్ జియో. గ్లోబల్ టెలికాం ఆపరేటర్లు, ఇంటర్నెట్ కంపెనీలు,
సెల్యూలార్ ఆపరేటర్లు 5జీ టెక్నాలజీని సులభం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాలు అభివృద్ది చెందాలంటే 5జీ సాంకేతికత అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. హై స్పీడ్ టెక్నాలజీ
కారణంగా పెద్ద ఎత్తున వినియోగం జరుగుతుంది. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ తదితర రంగాలన్నింటికి 5జీ టెక్నాలజీ అడ్వాంటేజ్ గా మారనుంది.
కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ వంటి వాటికి మద్దతు ఇస్తుంది. 5జీ వినియోగం మరింత కఠినతరం, ఖరీదైనదిగా మారనుంది. ఇది ఒక రకంగా వినియోగదారులకు కోలుకోలేని షాకే. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయవు. ఇది కూడా బిగ్ డిసడ్వాంటేజ్ అని చెప్పక తప్పదు.
వేగం ఉన్నా అప్ లోడ్ వేగం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా 5జీ టెక్నాలజీ అనుభవంగా మిగలనుందా లేక సంచలనంగా మారనుందా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.
Also Read : కుదేలవుతున్న వ్యవసాయ రంగం