Modhera Solar Village : సౌర విద్యుత్ గ్రామంగా ‘మోధేరా’ రికార్డ్
ప్రారంభించిన దేశ ప్రధానమంత్రి మోదీ
Modhera Solar Village : గుజరాత్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని మోధేరా గ్రామం దేశంలోనే మొట్ట మొదటి సోలార్ గ్రామంగా చరిత్ర సృష్టించింది. ఇది పూర్తిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. ఈ ఊరు మెహసానా జిల్లాలో ఉంది. దేశంలోనే తొలి సౌర విద్యుత్ వినియోగంతో కూడుకున్న పల్లెగా అవతరించింది.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. దేశంలోనే 24 గంటల సౌర విద్యుత్ తో నడిచే గ్రామంగా వినుతికెక్కింది. క్లీన్ ఎనర్జీ విజన్ ను ప్రతిబింబించే ఈ రకమైన మొదటి ప్రాజెక్టు ఇది. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సూర్య దేవాలయం ఉంది. ఈ సందర్భంగా మోదీ ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా చేశారు.
గ్రామంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు కింద భూమిపై సౌర విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని అన్ని నివాస, ప్రభుత్వ భవనాల పైకప్పులపై 1,300 కంటే ఎక్కువ సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. అన్ని ప్యానెల్ లు బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ద్వారా పరస్పరం అనుసంధానించారు.
మోధేరా గ్రామంలోని ప్రతి ఇంటికి దీని నుంచి విద్యుత్ అందుతుండడం దీని ప్రత్యేకత. ఈ గ్రామం ఇక నుంచి విద్యుత్ సరఫరాపై ఆధారపడదు. ఈ పల్లె స్వయంగా తన అవసరాల కోసం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనిని వాడడం వల్ల విద్యుత్ బిల్లుల మోత అంటూ ఉండదు.
ఇదిలా ఉండగా మోధేరాను పూర్తిగా సౌర విద్యుత్ గ్రామంగా(Modhera Solar Village) తయారు చేసేందుకు గాను రూ. 80.66 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో రాను రాను విద్యుత్ వినియోగం మరింత భారం కానుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది దేశం. సుదూర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సామన్యులను ఎలా శక్తిమంతం చేయగలదో చూపుతుంది. అంతే కాకుండా మోధేరా మాత్రమే కాకుండా సుజన్ పూర్ , సామ్లానాపరాలోని 1,383 ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా చేయనున్నారు.
సోలార్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యం ఉన్న దేశంలోనే మొట్ట మొదటి ఆధునిక గ్రామంగా మోధేరాను ప్రకటించారు మోదీ. రాబోయే రోజుల్లో మోధేరా పలు గ్రామాలకు ఆదర్శంగా మారుతుందనడంలో సందేహం లేదు.
Also Read : గుజరాత్ లో పీఎం నరేంద్ర మోదీ బిజీ