Gummadi Narsaiah : నా ఎన్నికల ఖర్చు లక్ష రూపాయలే
ఇల్లెందు మాజీ శాసన సభ్యుడు నర్సయ్య
Gummadi Narsaiah : ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతాడు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ అవసరమైనప్పుడు బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేసే ఏకైక మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Gummadi Narsaiah). ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అనైతిక చర్యలపై కామెంట్ చేశారు.
విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంపిణీ చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని అన్నారు. గుమ్మడి నర్సయ్య మీడియాతో మాట్లాడారు. 1983 -1994, 1999-2009 మధ్య కాలంలో ఐదుసార్లు ఇల్లెందు శాసనసభ్యుడిగా ఉన్నారు.
పేద, అణగారిన ప్రజల కోసం పని చేశారు. ఆదర్శవంతమైన జీవన శైలికి అలవాటు పడ్డారు. ఓటర్లకు తాను ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదన్నారు. నామినేషన్ల రుసుము, ర్యాలీల ప్రసంగానికి మైక్ లు, వాల్ పోస్టర్లు, ఇతర ఖర్చులకు మాత్రమే ఖర్చు చేశానని చెప్పారు. ప్రచారం చేస్తున్న సమయంలో గ్రామాల్లో ప్రజలే తనకు భోజనం పెట్టారని చెప్పారు.
2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల ఖర్చు రూ. 3 లక్షలకు చేరుకుందని తెలిపారు గుమ్మడి నర్సయ్య. 1983లో 14 మంది ఇండిపెండెంట్లు గెలిస్తే 13 మంది పార్టీలు మారారు. కానీ నర్సయ్య మారలేదు. ఇది ఆయన వ్యక్తిత్వం. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. విద్యుత్, విద్య, రోడ్లు ఏర్పాటు అయ్యేలా పాటుపడ్డారు.
ఇదిలా ఉండగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు గుమ్మడి నర్సయ్య నిబద్దతను కొనియాడారు. మీలాంటి వారు అసెంబ్లీకి రావడం నాలాంటి వారికే కాదు మిగతా వారికి స్పూర్తి దాయకంగా ఉందని కితాబు ఇచ్చారు.
Also Read : రాష్ట్రాల ఎన్నికల ఖర్చులో బీజేపీ టాప్