Sonia Gandhi Comment : కాంగ్రెస్ ప్రస్థానం సోనియా సంతకం
137 ఏళ్ల పార్టీపై చెరగని ముద్ర
Sonia Gandhi Comment : సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస పార్టీలో ఒక శకం ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇప్పటి వరకు పార్టీని నడిపిస్తూ వచ్చిన మేడం సోనియా గాంధీ తప్పుకున్నారు. ఆమె స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన కూలీ కొడుకు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టారు.
కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ కు అన్నీ తానై వ్యవహరించారు సోనియా గాంధీ(Sonia Gandhi). ఎన్నో ఆటు పోట్లను తట్టుకుని నిలబడింది. మరెన్నో అవమానాలను భరించింది. ఇటాలియన్ కు రాజకీయాలు ఎందుకు అంటూ పెద్ద ఎత్తున చెలరేగిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుంది సోనియా గాంధీ. అడ్డంకులను అధిగమించి,
తనయుడు అస్త్ర సన్యాసం చేసినా తానే ముందుండి గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. సీనియర్లు సహాయ నిరాకరణ చేసినా, అధికారం కోసం పదవులను, పార్టీని వీడినా , పార్టీని పలుచన చేసే ప్రయత్నాలు చేసినా భరించింది సోనియా గాంధీ. ఒకానొక దశలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ దానిని వదులుకున్నారు ఆమె.
పదవులు లేక పోయినా పవర్ అంతా తన చేతుల్లోనే పెట్టుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు రాజీనామా చేసి వెళ్లి పోయిన మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ సైతం రాహుల్ గాంధీని విమర్శించారే తప్పా సోనియా గాంధీని పల్లెత్తు మాట అనలేదు. రాజీవ్ గాంధీని ప్రేమించింది. సర్వస్వం అర్పించింది.
అదే సమయంలో అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ ను పోగొట్టుకుంది. పిల్లల్ని రాజకీయాలకు దూరంగా పెంచాలని అనుకుంది. కానీ నాటి నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ దాకా అంతా దేశ రాజకీయాలతో మమేకమై పోవడంతో సోనియా గాంధీ ఏమీ చేయలేక పోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను కూడా పవర్ పాలిటిక్స్ లో భాగం కావాల్సి వచ్చింది.
కాలం గాయాలను మాన్పుతుంది. చరిత్రను తిరగ రాసేలా చేస్తుంది. సోనియా గాంధీ(Sonia Gandhi) పడి లేచిన కెరటం కాదు. కానీ ఆమె ఈ దేశాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసింది.
చివరి దాకా తను భారతీయురాలేనని నిరూపించుకుంది. ఇక్కట్లను తట్టుకుని, సంక్షోభాలను దాటుకుని పార్టీని గాడి తప్పకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది.
సోనియా గాంధీని మరిచి పోలేం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో మూడింటి విషయంలో ఆమెను ఎప్పటికీ గుర్తుంచు కుంటుంది దేశం. సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం సోనియా చలవ వల్లనే సాధ్యమైందన్నది వాస్తవం.
అన్నింటికంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రజా ప్రస్థానంలో ఎప్పటికీ సోనియా గాంధీ సంతకం అలాగే ఉండి పోతుంది. ఇది అక్షరాల వాస్తవం.
Also Read : మేడంతో శశి థరూర్ ముచ్చట