Demonetization Comment : నోట్ల ర‌ద్దు వ‌ల్ల సాధించింది ఏమిటి

పెరిగిన న‌ల్ల ధ‌నం బాగుప‌డిన వ్యాపార‌గ‌ణం

Demonetization Comment : కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న నోట్ల ర‌ద్దు(Demonetization) ఆక‌స్మిక నిర్ణ‌యం ఇవాల్టితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఆశించిన ల‌క్ష్యం నెర‌వేర‌క పోగా భారీ ఎత్తున దేశానికి , ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లింది. దీనికి ప్ర‌ధాన కారణం అనాలోచిత ముంద‌స్తు ప్ర‌క‌ట‌న.

న‌ల్ల ధ‌నం బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తాన‌ని ఆర్భాటంగా వెల్ల‌డించారు. జాతిని ఉద్దేశించి ఆవేశంగా ప్ర‌సంగించిన మోదీ చివ‌ర‌కు తీర‌ని న‌ష్టాన్ని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా కుంగి పోయేలా చేశారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల చిన్న‌పాటి వ్యాపారులతో పాటు భారీ ఎత్తున కొలువులు కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఇక ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు క‌న్నం వేసి ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఎగ వేత‌కు పాల్ప‌డిన ఆర్థిక నేర‌గాళ్లు ఇంకా దేశం వెలుపల ద‌ర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రిని కూడా దేశానికి తీసుకు రాలేక పోయారు. మాయ మాట‌లు చెప్ప‌డం వ‌ల్ల ఒరిగింది ఏమీ ఉండ‌దు. ఇలా ఎంత కాలం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారో ఏలుతున్న వారు ఆలోచించు కోవాలి. 

ఇక నోట్ల ర‌ద్దుతో క‌నీసం రూ. 3 లేదా 4 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట ప‌డతుంద‌ని మోదీ ప్ర‌భుత్వం భావించింది. కానీ అందుకు భిన్నంగా జ‌రిగింది. 

మ‌రో వైపు చెల్లుబాటు కాని డ‌బ్బులో 99 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ చూపిస్తోంది.

న‌వంబ‌ర్ 8, 2016న పీఎం చేసిన అత్యుత్సాహ ప్ర‌క‌ట‌న ఇవాళ దేశం అధోగ‌తి పాలు కావ‌డానికి, ద్రవ్యోల్బ‌ణం కొన‌సాగేందుకు, నిరుద్యోగం పెచ్చ‌రిల్లేందుకు, అంత‌ర్జాతీయ మార్కెట్ లో ఎన్న‌డూ లేనంత‌గా రూపాయి విలువ భారీగా త‌గ్గేందుకు దోహ‌దం చేసింది. ఇది క్ష‌మించరాని నేరం.

రూ. 500, రూ. 1,000 నోట్లు ర‌ద్దు(Demonetization) చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల సామాన్యుల కంటే వ్యాపార‌వేత్త‌లు, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేట్లు లాభ‌ప‌డ్డారు.

వారి చేతుల్లోనే ప్ర‌ధాన వ‌న‌రులు కేంద్రీకృత‌మై ఉన్నాయి. ఆయిల్, బంగారం, రియ‌ల్ ఎస్టేట్, టెలికాం, ఫార్మా, వినోదం, క్రీడా, వాణిజ్య‌, వ్యాపార రంగాల‌లో భారీగా న‌ల్ల ధ‌నం చేతులు మారింది.

మార్కెట్ లో చెలామ‌ణిలో ఉన్న నోట్ల‌న్నీ ర‌ద్ద‌య్యాయ‌ని బ‌య‌ట‌కు అనిపించినా అవ‌న్నీ ఇత‌ర మార్గాల‌లో వ‌ర్క‌వుట్ అయ్యేలా జ‌రిగింద‌ని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్ర‌క‌ట‌న వ‌ల్ల 86 శాతం క‌రెన్సీ చెల్ల‌కుండా పోయింది. రియ‌ల్ ఎస్టేట్, బంగారం, ఆస్తుల రూపంలో మార్చుకున్నారు బ‌డా వ్యాపారులు.

నోట్ల ర‌ద్దు వెనుక మూడు ఆర్థిక ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు మోదీ(PM Modi). న‌ల్ల ధ‌నాన్ని నిర్మూలించ‌డం, న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ఏరిపారేయ‌డం, డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించ‌డం. 

ఈ మూడింటిలో ప్ర‌ధాన స‌మ‌స్య న‌ల్ల‌ధ‌నం. మ‌రి ఎంత ధ‌నాన్ని వెలికి తీశారో ఈరోజు వ‌ర‌కు ఆరేళ్లు పూర్త‌యినా ప్ర‌ధాని చెప్ప‌లేక పోయారు.

2019 ఫిబ్ర‌వ‌రిలో ఆనాటి మంత్రి గోయల్ న‌ల్ల ధ‌న నిరోధ‌క చ‌ర్య‌ల ద్వారా 1.3 ల‌క్ష‌ల కోట్ల ను వెలికి తీసిన‌ట్లు చెప్పారు. అదెక్క‌డుందో చెప్ప‌లేదు. మ‌రో వైపు తాను ఎప్పుడూ నోట్ల ర‌ద్దును స‌మ‌ర్థించ లేద‌ని స్ప‌ష్టం చేశారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజన్(Raghu Ram Rajan).

ఇదిలా ఉండ‌గా న‌కిలీ భార‌తీయ క‌రెన్సీ నోట్లు 10.7 శాతం పెరిగిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. 500 రూపాయ‌ల్లో 101.93 శాతం ఉండ‌గా 2,000 రూపాయ‌ల న‌కిలీ నోట్లు 54 శాతానికి పైగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. 

ఈ ఏడాది 2022లో ఆర్బీఐ తెలిపిన మేర‌కు రూ. 10 , రూ.20 న‌కిలీ నోట్ల‌లో వ‌రుస‌గా 16.45, 16.48 శాతం పెరిగిన‌ట్లు నివేదికలో పేర్కొంది. న‌కిలీ రూ.200 నోట్లు 11.7 శాతం పెరిగితే రూ. 50, రూ. 100 ల‌కు సంబంధించి వ‌రుస‌గా 28.65 శాతం, 16.71 శాతంగా న‌మోదైన‌ట్లు పేర్కొంది ఆర్బీఐ(RBI).

2016లో నోట్ల ర‌ద్దు  ప్రారంభంలో దేశ వ్యాప్తంగా 6.32 ల‌క్ష‌ల న‌కిలీ నోట్ల‌ను స్వాధీనం చేసుకుంది. గ‌త నాలుగేళ్ల‌లో వివిధ డినామినేష‌న్ల‌లో

 18.87 ల‌క్ష‌ల న‌కిలీ నోట్లు బ‌య‌ట ప‌డ్డాయి. ర‌ద్దు త‌ర్వాత చాలా న‌కిలీ నోట్లు రూ. 100 డినామినేష‌న్ల‌లో ఉండ‌డం విశేషం.

మొత్తం మీద ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వ‌ల్ల ఏం సాధించార‌నేది ఈ దేశానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

 

Also Read : నేపాల్..ఢిల్లీ.. గురుగ్రామ్ లో భూకంపం

Leave A Reply

Your Email Id will not be published!