Rahul Gandhi : అగ్నివీర్ పేరుతో కేంద్రం మోసం – రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆగ్రహం
Rahul Gandhi : అగ్ని వీర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశానికి ద్వేషం వద్దని ప్రేమ కావాలంటూ భారత్ జోడో యాత్రను చేపట్టారు.
ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పూర్తయింది. మహారాష్ట్రలో జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. అనంతరం మధ్యప్రదేశ్ కు చేరుకుంటుంది. యాత్రలో భాగంగా మరాఠా లోని మాలెగావ్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు.
అగ్ని వీర్ పథకం పేఉతో కేంద్ర సర్కార్ యువత మనోభావాలతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు మోయలేనంత భారం మోపారంటూ ఆరోపించారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నా ఇప్పటి వరకు నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నా పాపాన పోలేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై భగ్గుమన్నారు.
కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తోందంటూ బీజేపీపై మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్ర చేపట్టామని అన్నారు రాహుల్ గాంధీ.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇలా ప్రతిదీ పెంచుకుంటూ పోతున్నారని వాపోయారు. ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
అగ్ని వీర్ గా మారండి..ఆరు నెలలు శిక్షణ తీసుకుని నాలుగు ఏళ్లు ఆర్మీలో పని చేసి జీవితాంతం నిరుద్యోగులుగా మారండి అంటూ మోదీ యువతీ యువకులను మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
ఈ యాత్ర కుల, మతాలకు అతీతంగా సాగుతోందన్నారు. అన్ని వర్గాలకు చెందిన వారు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు .
Also Read : బీజేపీ కుట్రలు చెల్లవు ఆటలు సాగవు – సోరేన్