Sanitary Pads Comment : ప్రాణం పోసే వాళ్ల‌కు ప్యాడ్స్ ఇవ్వ‌లేమా

పాల‌కులు ఇక‌నైనా సిగ్గు పడాలి

Sanitary Pads Comment : ఈ దేశం సిగ్గుతో త‌ల దించు కోవాల్సిన ప‌రిస్థితి. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ కొలువుతీరిన స‌మున్న‌త భార‌తంలో నేటికీ బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతూ ఉండ‌డం. స‌భ్య స‌మాజం ప‌రుగులు తీస్తోంది. అనేక మార్పులతో ప్ర‌భావితం చేస్తూ వ‌స్తోంది.

కుటుంబ వ్య‌వ‌స్థ‌కు ప్రాణ ప్ర‌ద‌మై దేశ పురోభివృద్దిలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న మ‌హిళ‌ల (బాలికల‌) ప‌ట్ల ఎందుకింత‌టి క‌క్ష. దేశ విముక్తి కోసం జరిగిన ధీరోదాత్త పోరాటంలో వాళ్లు భాగ‌స్వాములుగా ఉన్నారు.

ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు. మ‌రెంద‌రో చ‌రిత్ర సృష్టించారు. కానీ స్వ‌తంత్రం వ‌చ్చాక కూడా ఆడపిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలకు ఆమ‌డ దూరంలో ఉన్నారు. ఆకాశంలో స‌గం అన్నారు. అవ‌నిలో నువ్వే రాణివ‌ని కీర్తించారు. కానీ నేటికీ వాళ్ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయ‌మైన స్థితిలో ఉందంటే న‌మ్మ‌గ‌ల‌మా.

మ‌నం దేశానికి స్వేచ్ఛ ల‌భించినందుకు 75 ఏళ్లు అయిన సంద‌ర్భంగా సంబురాలు చేసుకుంటున్నాం. కానీ ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొంటున్న తీవ్ర‌మైన రుతుక్ర‌మం (మెన్స‌స్) గురించి నేటికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని స్థితిలో ఉన్నాం.

137 కోట్ల భార‌తీయుల్లో స‌గానికి పైగా జ‌నాభా ఉంది మ‌హిళ‌ల‌దే. కోట్లాది మంది బాలిక‌లకు విద్య లేదు. స‌రైన సుభ్ర‌త లేదు. అంత‌కంటే మెరుగైన సౌక‌ర్యాలు లేవు.

ప్ర‌తి రోజూ నిత్యం జ‌రిగే కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్స్ లేవు. విద్య‌, వైద్యం, ఉపాధి, టెక్నాల‌జీ అంటూ రోజూ జ‌పిస్తున్నాం. కానీ నిత్యం చెప్పుకోలేని స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతూ కుంగి పోతున్న వాళ్లు ఎంద‌రో. ఒక ర‌కంగా వీళ్ల‌ను అభాగ్యుల‌ని చెప్ప‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు.

ఎందుకంటే పాలిచ్చి, ప్రాణం పోసే మ‌హిళ‌ల ప‌ట్ల ఎందుకు వివ‌క్ష చూపిస్తున్నామో పాల‌కులు ఆలోచించు కోవాలి. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో, అడ్డ‌మైన స‌బ్సిడీల పేరుతో, బాండ్ల పేరుతో కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకుంటున్న పార్టీలు, దానిని న‌డిపిస్తున్న వ్యాపారులు, కార్పొరేట్లు, కుబేరులు, ధ‌న‌వంతులు ఎందుకు ఆలోచించ‌డం లేదు.

ప్రాథ‌మిక విద్య అన్న‌ది లేక పోతే దేశం అంధ‌కారం అవుతుంద‌న్న జ్యోతిబా పూలే ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలి. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగంలోనే ప్రాథ‌మిక హ‌క్కులు ప్ర‌తి ఒక్క‌రికీ వ‌ర్తిస్తాయి.

మ‌రి 6 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న కోట్లాది మంది బాలిక‌ల‌కు ప్ర‌తి నెలా వాడే శానిట‌రీ నాప్కిన్ల (ప్యాడ్స్ ) ను(Sanitary Pads) ఇవ్వ‌డం కేంద్రానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చేత కాదా.

అంత బ‌డ్జెట్ మ‌న వ‌ద్ద లేదా. ఛీ ఛీ ఇక‌నైనా ప్ర‌భుత్వాలు మారాలి. త‌మ సంకుచిత ఆలోచ‌నా ధోర‌ణి నుంచి బ‌య‌ట ప‌డాలి. స్వ‌చ్ఛంద సంస్ధ‌లు ఎన్నో ఇప్ప‌టికీ రుతు స‌మ‌స్య‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన మురుగ‌నాథ‌న్ లాంటి వాళ్ల‌ను స్పూర్తి దాయ‌కంగా తీసుకోవాలి.

ఇవాళ మ‌రోసారి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌లు. సీజేఐ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కేంద్రానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు , లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల‌కు నోటీసులు పంపించారు.

6 నుంచి 12వ త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ఎందుకు శానిట‌రీ నాప్కిన్ల‌ను (Sanitary Pads)  ఉచితంగా ఇవ్వ‌డం లేద‌ని. ఈ పిల్ల‌లకే ఎందుకు దేశంలోని బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల‌కు ఫ్రీగా ఇస్తే త‌ప్పేంటి. వాళ్లు స‌మాజంలో భాగం కాదా. వాళ్లు ఈ దేశ అభివృద్దిలో పాలు పంచు కోవ‌డం లేదా. ఒక్కసారి స‌భ్య స‌మాజం యావ‌త్తు ప్ర‌జానీకం ఆలోచించాలి.

ఉచితంగా నాప్ కిన్ల‌ను ఉచితంగా ఇవ్వాలంటూ జ‌యా ఠాకూర్ పిటిష‌న్ దాఖ‌లు చేసినందుకు ఆమెను ప్ర‌త్యేకంగా అభినందించాలి. ఉచితంగా శానిట‌రీ ప్యాడ్స్ ఇవ్వాల‌నేది నినాదంగా మారాలి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుకుందాం.

Also Read : ఫోర్బ్స్ లిస్టులో ఫ‌ల్గుణి..సావిత్రి జిందాల్

Leave A Reply

Your Email Id will not be published!