Ramiz Raja : ఆతిథ్య హక్కులు తొలగిస్తే ఆలోచిస్తాం – పీసీబీ
ఆసియా కప్ నుంచి వైదొలిగే అవకాశం
Ramiz Raja : వచ్చే ఏడాది 2023 రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఆ రెండు ఆసియా ఖండంలో ఉండడం విశేషం. మొదట ఆసియా కప్ ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కాగా తమ జట్టు పాకిస్తాన్ లో ఆడబోదంటూ ఇప్పటికే ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జే షా. దీనిపై తీవ్రంగా స్పందించారు పాకిస్తాన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా(Ramiz Raja).
మీరు గనుక తమతో ఆడక పోతే మీ ఆధ్వర్యంలో ఇండియాలో నిర్వహించే ఐసీసీ వరల్డ్ కప్ లో తాము ఆడబోమంటూ ప్రకటించారు. దీనిపై సీరియస్ అయ్యారు కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రతి దేశం తమతో ఆడాలని అనుకుంటుందని, తమతో ఆడక పోతే నష్టపోయేది తాము కాదని పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం మరింత ముదిరింది. శనివారం పీసీబీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జే షా ఉన్నారు. ఆథిత్య హక్కులు గనుక పాకిస్తాన్ నుంచి తీసివేస్తే తాము ఆసియా కప్ లో ఆడాలా లేదా అన్నది ఆలోచిస్తామని చెప్పారు.
తాజాగా రమీజ్ రాజా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారత్ రాక పోతే వాళ్ల ఇష్టం ..ఆసియా కప్ ను పాకిస్తాన్ కు దూరం చేయాలని చేస్తే తాము వైదొలిగేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపారాన్ని సృష్టించే క్రికెట్ జట్టును మేం ఓడించాం. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read : శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి – బదానీ