Rahul Gandhi Comment : దేశం చూపు ‘రాహుల్’ వైపు
మోదీకి అతడే ప్రత్యామ్నాయం
Rahul Gandhi Comment : దేశానికి విద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ సంచలన నినాదంతో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3,500 కిలోమీటర్లకు పైగా 150 రోజుల పాటు చేపట్టిన యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది.
అంపశయ్యపై ప్రాణం పోలేక కొట్టుమిట్టాడుతున్న 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఆక్సిజన్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. ఇందులో ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, లేదా మరెన్ని విమర్శలు గుప్పించినా అక్షరాల వాస్తవం.
గతంలో ఉన్న రాహుల్ వేరు. ఇప్పుడు పూర్తిగా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ వేరు. ఎందుకంటే ఆయన ఎక్కడా పల్లెత్తు వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. ప్రధానంగా పార్టీ గురించి ఊసెత్తడం లేదు. 50 ఏళ్లకు పైబడిన రాహుల్ గాంధీ రోజుకు 20 కిలోమీటర్లకు పైగా నడుస్తున్నారు.
అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆయనను స్వాగతిస్తున్నారు. అంతే కాదు చిన్నారుల నుంచి పెద్దల దాకా కులం, ప్రాంతం, మతం, భేషజాలు లేకుండా రాహుల్ గాంధీని అక్కున చేర్చుకుంటున్నారు. ఒక రకంగా ఆయన సాహసమే చేస్తున్నారని చెప్పక తప్పదు. రాహుల్ కుటుంబం చాలా కోల్పోయింది ఈ దేశం కోసం.
వాళ్ల ఫ్యామిలీ ఒక రకంగా ఎంతో నష్ట పోయింది. ఆయన నాయినమ్మ ఇందిరా గాంధీని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కన్న తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయారు. ఇంత జరిగినా ఎక్కడా భయాందోళనకు గురి కాలేదు. తాను ఈ దేశాన్ని ముక్కలు కానివ్వబోనంటూ ప్రకటించాడు ధైర్యంగా రాహుల్ గాంధీ.
ఇవాళ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ, భక్తిని మార్కెట్ మయంగా మార్చేసి , దేశాన్ని వ్యాపారులు, బడా బాబులు, కార్పొరేట్లకు ధారదత్తం చేస్తూ ప్రచార ఆర్భాటంలో మునిగి పోయిన కోట్లాది మంది ప్రజల కళ్లు తెరిపించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు తాము కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ, ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ పోతే రేపు దేశానికి ఏం మిగులుతుందని నిలదీస్తున్నారు. మాయ మాటలతో మభ్య పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోదీకి ప్రత్యామ్నాయంగా కోట్లాది ప్రజలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ విశ్వాసమైన, అంది వచ్చిన నాయకుడిగా కనిపిస్తున్నారు.
ఆయన ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. ఈ దేశం డబ్బున్న వాళ్లది కాదు మీదని చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కూల్చి వేస్తే ఇక మిగిలింది కాషాయం తప్ప ఏమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఒక రకంగా రాహుల్ గాంధీలో వచ్చిన ఈ మార్పు ఆహ్వానించ దగింది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఎలా అన్వయించు కుంటుందో అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : రాహుల్ యాత్రలో ‘సచిన్’ హల్ చల్