Arvind Kejriwal : ఢిల్లీ బల్దియా ఎన్నికలు కఠినమైనవి
ఆప్ చీఫ్..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆప్ ఏర్పడిన నాటి నుంచి అత్యంత సవాల్ గా మారిన ఎన్నికలు ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలేనని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎదుర్కొన్న ఎన్నికలకు సంబంధించి ఇవే అత్యంత ఇబ్బందికరంగా తమకు మారాయని తెలిపారు.
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం తమను చాలా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అయినా ఢిల్లీలో ఆప్ సర్కార్ ఎక్కడా పొరపాట్లు చేయలేదన్నారు. కానీ తమపై లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం జరిగిందన్నారు కేజ్రీవాల్. ఇలాంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడం తమకు మామూలేనని చెప్పారు.
ఇదే సమయంలో బీజేపీ ఇంకా తన ప్రయత్నాలు చేస్తూనే ఉందన్నారు. ఓ వైపు ప్రజలు ఆ పార్టీని వద్దనుకుని 104 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రాలేదన్నారు. ఆప్ తరపున ఎన్నికైన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం మొదలు పెట్టిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఒక్కొక్కరికీ రూ. 50 లక్షలు ఇచ్చేందుకు సైతం వెనుకాడడం లేదన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఇలాంటి చౌకబారు పనులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఆప్ చీఫ్. కానీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఆప్ కౌన్సిలర్లు లొంగి పోరని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు చేసినా చివరకు ఢిల్లీ నగర పౌరులు ఆమ్ ఆద్మీ పార్టీపైనే నమ్మకం ఉంచారని అన్నారు సీఎం. తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన ఫలితాలు ఇవని పేర్కొన్నారు.
Also Read : వ్యవస్థల నిర్వీర్యం దేశానికి ప్రమాదం