Argentina Win FIFA 2022 : ఫిఫా వరల్డ్ కప్ జగజ్జేత అర్జెంటీనా
కప్ ను ముద్దాడిన లియోనెల్ మెస్సీ
Argentina Win FIFA 2022 : ఖతార్ లోని దోహా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ -2022 ఫైనల్ లో విజేతగా నిలిచింది లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా. ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో ఓడించి జగజ్జేత తానేనంటూ నిరూపించింది. సాకర్ ప్రపంచం నుంచి సగర్వంగా నిష్క్రమించనున్నాడు అర్జెంటీనా సారథి మెస్సీ. తన సుదీర్ఘ ఫుట్ బాల్ కెరీర్ లో ఇదే ఆఖరి టోర్నీ అని ప్రకటించాడు.
కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూశారు ఈ క్షణం కోసం. తను పదవీ విరమణ చేసే లోపు అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్(Argentina Win FIFA 2022) అందించాలని కల కన్నాడు. అదే తన అంతిమ లక్ష్యమని ప్రకటించాడు మెస్సీ. ఖతార్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది ఫిఫా వరల్డ్ కప్. మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి.
చివరకు ఫ్రాన్స్ మొరాకోను సెమీస్ లో 2-0 తేడాతో ఓడిస్తే అర్జెంటీనా క్రొయేషియాను 3-0 తేడాతో ఓడించి ఫైనల్ కు చేరాయి. ఈ మొత్తం టోర్నీలో లియోనెల్ మెస్సీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అర్జెంటీనాకు అద్భుతమైన కానుకను అందించాడు వెళుతూ వెళుతూ.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే దోహా స్టేడియంలో ఇసుక వేస్తే రాలనంత సాకర్ అభిమానుల హర్ష ధ్వానాల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఆట ప్రథమార్థంలో అర్జెంటీనా 2 గోల్స్ తో ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్థంలో ఫ్రాన్స్ 2 గోల్స్ చేసింది. దీంతో ఆటను పొడిగించారు. ఇదే సమయంలో 3-3 గోల్స్ తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.
దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్ణయించారు అంపైర్లు. అర్జెంటీనా 4 గోల్స్ చేస్తే ఫ్రాన్స్ 2 గోల్స్ మాత్రమే చేసింది. దీంతో అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది.
Also Read : ‘మార్టినెజ్ మెస్సీ’ భావోద్వేగం