Kaikala Satyanarayana : ‘కైకాల’ సినీ ప్రస్థానం చిరస్మరణీయం
విలక్షణ నటుడు సత్యనారాయణ
Kaikala Satyanarayana : తెలుగు సినిమా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. 60 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన అరుదైన నటుడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. ఇక నటించ లేనంటూ వెళ్లి పోయారు. భిన్నమైన పాత్రలను పోషించారు. అంతకంటే ఎక్కువగా తనదైన ముద్ర ఉండేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
ఆయనకు 87 ఏళ్లు. జూలై 25, 1935లో ఆంధ్ర ప్రదేశ్ లోని కౌతవరం లో పుట్టారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఎంపీగా కూడా పని చేశారు. అరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో పాత్రలలో నటించారు..మెప్పించారు. ఎందరో అభిమానులను పొందారు. దాదాపు 777కు పైగా సినిమాలలో పాత్రల్ని పోషించారు.
ఆయన నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రిక, జానపద చిత్రాలలో నటించారు. కమెడియన్, విలన్ గా, హీరోగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేశారు కైకాల సత్యనారాయణ. ఎస్వీ రంగారావు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఏకైక నటుడు ఆయనే కావడం విశేషం. 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు.
ప్రతినాయకుడి పాత్రలలో ఎక్కువగా నటించారు. ఎస్వీ కృష్ణా రెడ్డి తీసిన సినిమాలో ఆయన చేసిన యముడి పాత్రకు ఎక్కువగా పేరొచ్చింది. ఆయన కంఠంలో గాంభీర్యం ఉంటుంది. అందుకే ఏరికోరి విలన్ పాత్రల్లో నటించారు. కైకాలను గుర్తించింది మొదటగా డీఎల్ నారాయణ.
ఆ సినిమా ఆడక పోయినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు దర్శకులు. కైకాలను ప్రోత్సహించారు దివంగత ఎన్టీఆర్. 1960లో అపూర్వ చింతామణిలో ఛాన్స్ ఇచ్చారు. ప్రతినాయకుడికి సరిగా సరిపోతారని ముందుగా గుర్తించింది మాత్రం జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య. యమగోల, యమలీల సినిమాల్లో యముడిగా చేసి అలరించాడు.
పౌరాణిక సినిమాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రల్లో నటించారు కైకాల సత్యనారాయణ. ఆయన రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు.
1996లో టీడీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఫిలిం ఫేర్ అవార్డు, జీవతకాల సాఫల్య పురస్కారం, నంది అవార్డు పొందారు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana). రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, నటశేఖర పురస్కారం అందుకున్నారు.
కళా ప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా పొందారు. గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరం.
Also Read : కైకాల సత్యనారాయణ ఇకలేరు