Mahua Moitra : ప్రశ్నిస్తే నేరమైతే ప్రజాస్వామ్యం ఎందుకు
కేంద్ర సర్కార్ పై మహూవా మోయిత్రా ఫైర్
Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra) నిప్పులు చెరిగారు. మరోసారి ఆమె కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈ దేశంలో ప్రశ్నించే వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం ఒక పనిగా పెట్టుకుందంటూ ఆరోపించారు మోయిత్రా.
తమ పార్టీకి చెందిన సాకేత్ గోఖలేను పదే పదే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఒక రకంగా మోదీని, అమిత్ షాను నిలదీశారు. గత 15 రోజుల్లో వేధింపులకు గురి చేస్తూ ఉండడాన్ని తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ. ఇప్పటి వరకు మూడుసార్లు అరెస్ట్ చేయడాన్ని నిలదీశారు మహూవా మోయిత్రా.
ఈ మొత్తం వ్యవహారాన్ని దేశంలోని ప్రజలంతా చూస్తున్నారని , రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు టీఎంసీ ఎంపీ. ఇదిలా ఉండగా టీఎంసీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్న గోఖలేను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారంటూ అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించారు.
కేవలం ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ గా పెట్టుకున్నారని, ప్రశ్నించడాన్ని తట్టుకోలేక పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహూవా మోయిత్రా(Mahua Moitra) . ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి, దాని అనుబంధ సంస్థల నాయకులు, ప్రతినిధులకు ఎదురుకాక తప్పదని స్పష్టం చేశారు ఎంపీ.
గుజరాత్ లో నిన్న సాయంత్రం సాకేత్ గోఖలేను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్వీట్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : ఆజం ఖాన్ ఇల్లు బీజేపీ ఎమ్మెల్యేకు